భారత్లో వుంటున్న ముస్లింలు గో వధ, లవ్ జిహాద్ లాంటి వివాదాల పేరిట వేధింపులు ఎదుర్కుంటున్నారని, అందుకే వాళ్లు ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం వుందని అన్నారు కాశ్మీర్ డిప్యూటీ ముఫ్తి అజమ్ నజీర్-ఉల్-ఇస్లాం. ప్రస్తుతం భారతీయ ముస్లింలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో వున్నారు. భారత ప్రభుత్వం వారి దుస్థితిని పట్టించుకోవడం లేదు. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే, భారత్లో వున్న ముస్లింలు ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయాల్సి వస్తుందని డిప్యూటీ ముఫ్తి స్పష్టంచేశారు.
"కేవలం 17 కోట్ల జనాభాతోనే పాకిస్థాన్ ఏర్పడింది. అటువంటప్పుడు భారత్లో అత్యధిక జనాభా సంఖ్యా పరంగా రెండో స్థాయిలో వున్న భారతీయ ముస్లింలు ఎందుకు ప్రత్యేక దేశం కోరుకోకూడదు" అని తన వాదనను సమర్థించుకున్నారు కాశ్మీర్ డిప్యూటీ ముఫ్తి అజమ్ నజీర్-ఉల్-ఇస్లాం. భారతీయ ముస్లింలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పే క్రమంలో ఏఎన్ఐతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ డిప్యూటీ ముఫ్తి అజమ్ నజీర్-ఉల్-ఇస్లాం చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి దుమారానికి తెరతీయనున్నాయో వేచిచూడాల్సిందే మరి!!