ఈసారి 'రిపబ్లిక్ డే' వేడుకలకు గాను వివిధ రాష్ట్రాల తరఫున ప్రదర్శనకు పంపించే శకటాల విషయంలో కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ శకటాలను ఎంపిక చేయడానికి నిర్వహించిన పోటీలో ఇరు తెలుగు రాష్ట్రాల శకటాలు కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ఈ సారి సవరజాతికి చెందిన సంప్రదాయ, సంస్కృతులను తెలియజేసే శకటాన్ని పంపించగా..అది ఫైనల్ రౌండ్‌కు వెళ్లినా, ప్రదర్శనకు మాత్రం ఎంపిక కాలేదు.
అలాగే తెలంగాణ నుండి "సమ్మక్క సారక్క గిరిజన పండుగ" ప్రాధాన్యాన్ని తెలిపే శకటాన్ని పంపగా.. అది ప్రిలిమినరీ రౌండ్లోనే వెనక్కి వచ్చింది. సాధారణంగా ఈ శకటాల ఎంపికను కేంద్ర రక్షణశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రతీ సంవత్సరం ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాలూ పాల్గొంటున్నా.. శకటాల విషయానికి వస్తే కేవలం 15 రాష్ట్రాల శకటాలకు మాత్రం అవకాశం కల్పిస్తారు. గతంలో ఒకసారి "సంక్రాంతి సంబరాలు" పేరుతో ఆంధ్రప్రదేశ్ పంపించిన శకటం ప్రదర్శనకు నోచుకుంది