రాజకీయ భీష్ముడికి 93 ఏళ్లు: అటల్‌జీ జీవిత ప్రస్థానం ఇదే

ఆయన రాజకీయ భీష్ముడుగా పేరొందిన గొప్ప నేత. బీజేపీ పార్టీ తరఫున దేశ ప్రధానమంత్రిగా ఎన్నికైనా.. ఇతర పార్టీ నేతలతో కూడా కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉండే  అజాత శత్రువు.  

Last Updated : Dec 26, 2017, 12:20 PM IST
రాజకీయ భీష్ముడికి 93 ఏళ్లు: అటల్‌జీ జీవిత ప్రస్థానం ఇదే

ఆయన రాజకీయ భీష్ముడుగా పేరొందిన గొప్ప నేత. బీజేపీ పార్టీ తరఫున దేశ ప్రధానమంత్రిగా ఎన్నికైనా.. ఇతర పార్టీ నేతలతో కూడా కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉండే అజాత శత్రువు.  మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించిన తను.. ఆ తర్వాత మూడు పర్యాయాలు భారత ప్రధాని గా బాధ్యతలు నిర్వహించారు. ఆయనే 'భారతరత్న' అటల్ బిహారీ వాజ్‌పేయి. ఈ రోజు ఆయన 93వ జన్మదినోత్సవం సందర్భంగా.. ఆ పొలిటికల్ లెజెండ్ గురించి పలు విషయాలు మనం  కూడా తెలుసుకుందాం..!

డిసెంబర్ 25, 1924 తేదిన గ్వాలియర్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణాదేవి మరియు కృష్ణబిహారీ దంపతులకు జన్మించిన అటల్ బిహారి వాజ్‌పేయి చిన్నప్పుడు  సరస్వతి శిశు మందిర్‌లో విద్యాభ్యాసం చేశారు.  కాన్పూరులోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి ఎంఏ (రాజనీతి శాస్త్రం) పట్టా పొందిన వాజ్‌పేయి కళాశాల రోజుల్లోనే  ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో సన్నిహిత సంబంధాలు కలిగుండేవారు.

1944లో అదే విభాగానికి సెక్రటరిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కార్యకర్తగా చేరారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా పనిచేస్తూనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడిపే "రాష్ట్రధర్మ" పత్రికలో వ్యాసాలు రాసేవారు వాజ్‌పేయి.1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, వాజ్‌పేయి తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించారు. ఆ సమయంలో జాతీయవాద నేతల్లో ముఖ్యుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిచయం వాజ్‌పేయి జీవితాన్నే మార్చేసింది. 

స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేసిన అనుభవం ముఖర్జీకి ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక కాశ్మీరులో, కాశ్మీరేతర భారతీయులను చిన్నచూపు చూస్తున్నారనే వాదన తలెత్తడంతో ముఖర్జీతో సహా వాజ్‌పేయి కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తర్వాత 1957లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వాజ్‌పేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

1968లో శ్యాంప్రసాద్ ముఖర్జీ సొంత సంస్థైన జనసంఘ్‌కు బాధ్యతలు స్వీకరించి జాతీయ అధ్యక్షునిగాఎన్నికయ్యారు వాజ్‌పేయి. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్ మరియు లాల్ కృష్ణ అద్వానీలతో కలిసి జనసంఘ్ ఉన్నతికి పాటుపడ్డారు. 1977లో  జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు, వాజపేయి జనసంఘ్‌ను జనతాపార్టీలో విలీనం చేశారు. అదే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధించాక ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖామాత్యులుగా పనిచేశారు.

విదేశీ వ్యవహారాల మంత్రిగా వాజ్‌పేయి ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. అయితే జనతా పార్టీ ఎక్కువ రోజులు ఉండలేదు. ఆదిలోనే విఛ్ఛిన్నమైపోయింది. ఈ క్రమంలో  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ మరియు భైరాన్ సింగ్ షెకావత్లను కలుపుకొని వాజ్‌పేయి 1980లో భారతీయ జనతా పార్టీని యేర్పరచారు.

1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యాక..  ఢిల్లీలో సిక్కుల పై జరిగిన దాడులను వాజ్‌పేయి తీవ్రంగా ఖండించారు. 1990ల నాటికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యర్థిగా అవతారమెత్తింది. సానుకూల జాతీయవాద భావజాలపు ప్రభావంతో భారతీయ జనతాపార్టీ బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బి.జె.పి అవతరించాక..  వాజపేయి భారత 10వ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 

అయితే 13 రోజులే ఆ పదవిలో ఆయన కొనసాగారు. 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బి.జె.పి అధికారం చేజిక్కించుకున్నాక, కొన్ని ఇతర పార్టీల మద్దతుతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌గా ఏర్పడింది.

వాజపేయి ఎన్డీఏ తరఫున రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. అయితే  ఏ.ఐ.ఏ.డి.ఎం.కె పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 

భారత్ - పాకిస్తాన్‌ల మధ్య 1999 సంవత్సరంలో మే నుండి జూలై వరకు కాశ్మీర్లోని కార్గిల్ జిల్లా సరిహద్దుల వద్ద యుద్ధం జరిగింది. ఎందురో భారతీయ సైనికులు ఈ యుద్ధంతో ప్రాణాలు కోల్పోయారు. అయితే వాస్తవాధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం మళ్లీ స్వాధీనపరుచుకుంది. కార్గిల్ యుద్ధం తర్వాత 1999 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్.డి.ఏ కూటమి లోక్‌సభ‌లో 303 స్థానాలు గెలిచింది. వాజపేయి అక్టోబరు 13, 1999 తేదిన మూడవసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

2002లో గుజరాత్ రాష్ట్రంలో హిందూ, ముస్లింల మధ్య హింసాకాండ జరిగింది. దీని ఫలితంగా 1000 మంది ప్రజలు మరణించారు. వాజపేయి అధికారికంగా ఈ హింసాకాండను ఖండించారు. 2005 డిసెంబర్ నెలలో ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజపేయి క్రియాశీల రాజకీయాలనుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. 2009, ఫిబ్రవరి 6న వాజపేయి ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేరారు. ఆ తర్వాత వెంటిలేషన్ సహకారంతో చాలా రోజులు గడిపి, ఆ తరువాత కోలుకొన్నారు.

ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్‌పేయి భారతదేశంలో ఎన్నో సంస్కరణలకు నాంది పలికారు. ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు.

ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధనలకు ఊతమిచ్చారు. "నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టు" మరియు "ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన"కు  నాంది పలికింది వాజ్‌పేయి ప్రభుత్వమే. భారతీయ ఆర్థికరంగాన్ని సమూలంగా పరివర్తనం చేసి, విస్తరించే దిశగా వాజపేయి వ్యాపారరంగానికి మద్దతునిస్తూ, స్వేచ్ఛా విపణి సంస్కరణలను ప్రోత్సహించారు.

2001 లో వాజపేయి ప్రభుత్వం, ప్రాథమిక మరియు సెకండరీ విద్య అభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత పాకిస్థాన్‌ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుటకు గాను ఆగ్రా ఒప్పందం కొరకు పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఢిల్లీకి వాజ్‌పేయి ఆహ్వానించడం చరిత్రలో నిలిచిపోయిన అంశం. 

పద్మవిభూషణ్, లోకమాన్య తిలక్ పురస్కారం, గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డుతో పాటు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను పొందిన రాజకీయ మేధావి వాజ్‌పేయి. 

 

Trending News