ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. "ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పుడు మనవి రెండు. కానీ ఇప్పుడు మనము 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము" అన్నారు.
గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మోదీ తొలిసారి పార్లమెంటరీ బీజేపీ పార్టీ సమావేశానికి వచ్చారు. ఆయన హాల్ లోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఆసీనులైన నాయకులందరూ ఒక్కసారిగా లేచి.. చప్పట్లతో స్వాగతం పలికారు. దీంతో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించి విజయం సాదించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు మోదీ. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, ఆ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.