అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వ్యవహరించిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) విషయంలో నిమ్మగడ్డ లాజిక్ మిస్ అయినట్టే కన్పిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ( AP AG Subrahmanya Sriram ) స్పష్టం చేశారు. హై కోర్టు ఇచ్చిన తీర్పులో, రమేష్ కుమార్ వెంటనే ఎస్ఈసీగా తనకు తానుగా కొనసాగవచ్చని చెప్పలేదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పారు. ఆయనను తిరిగి ఎస్ఈసీగా కొనసాగించమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించిందని.. అటువంటప్పుడు తనకు తానుగా ఎలా ప్రకటించుకుంటారన్నారు. ఎస్ఈసీ నియమించే అధికారం రాష్ట్రానికి గానీ... మంత్రుల సలహా తీసుకోవడం గవర్నర్ పరిధిలో లేదని చెప్పినప్పుడు.. సహజంగానే ఇదే అంశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకానికి కూడా వర్తిస్తుందని ఏజీ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎస్ఈసీ వివాదంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా విడుదల చేసిన సర్క్యులర్లపై ఆయన అభ్యంతరం చెప్పారు.
తన నియామకం పునరుధ్ధరణకు సంబంధించి రమేష్ కుమార్ ఇచ్చిన సర్క్యులర్లు హై కోర్టు తీర్పునకు అనుగుణంగా లేవని శ్రీరామ్ వివరించారు. జస్టిస్ కనగరాజును ( Kanagaraju ) ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హై కోర్టు తోసిపుచ్చినట్లు రమేష్ కుమార్ తన సర్క్యులర్లలో రాశారని ఆయన తెలిపారు. ఎస్ఈసీ అంశంపై హై కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటీషన్ వేశామని.. ఈలోగా రమేష్ కుమార్ తొందరపడి సర్క్యులర్లు విడుదల చేశారని అన్నారు.
తీర్పు వచ్చిన వెంటనే రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగవచ్చని హై కోర్టు చెప్పలేదని శ్రీరామ్ అన్నారు. హైదరాబాద్లోని క్యాంప్ ఆఫీసులో ఉంటూ... విజయవాడ ఆఫీసు నుంచి విడుదల చేసినట్లు సర్క్యులర్లలో పేర్కొన్నారన్నారు. తనకు కేటాయించిన వాహనాలను సైతం హైదరాబాద్ క్యాంపు ఆఫీసుకు పంపాలని సర్క్యులర్ జారీ చేశారని శ్రీరామ్ చెప్పారు.
ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తుందని అడ్వకేట్ జనరల్ శ్రీ రామ్ స్పష్టం చేశారు. ఓ ప్రిన్సిపల్ కార్యదర్శి హోదా కలిగిన వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించే అధికారం రాష్ట్రం, గవర్నర్ పరిధిలో లేనప్పుడు… గతంలో ఇదే నిమ్మగడ్డ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన కూడా పని చేయదని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఏపీ సర్కార్ తరపున ఏజీ శ్రీరాం వినిపిస్తున్న ఈ వాదనపై నిమ్మగడ్డ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..