Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ సీరియస్, క్లాస్ పీకడానికే ఢిల్లీ పిలిపించారా..?

Telangana BJP: బీజేపీ పెద్దలు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? ఉన్న పళంగా తెలంగాణ  బీజేపీ నేతలను ఎందుకు ఢిల్లీకీ పిలిపించినట్లు..? తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా..? అందుకే బీజేపీ నేతలను హై కమాండ్ హస్తినకు రావాలని ఆదేశించిందా...? నేతల తీరుతో విసిగిపోయి క్లాస్ పీకేందుకే ఢిల్లీ రమ్మని అల్టిమేట్ ఇచ్చిందా..? ఇక తెలంగాణ బీజేపీ సంగతి ఏంటో తేల్చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యిందా..?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Nov 27, 2024, 04:25 PM IST
Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ సీరియస్, క్లాస్ పీకడానికే ఢిల్లీ పిలిపించారా..?

Telangana BJP : చాలా రోజుల తర్వాత బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. ఒక వైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు మహారాష్ట్ర రాజకీయాలు ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా తెలంగాణ బీజేపీ నేతల ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. ఉన్నట్లుండి బీజేపీ పెద్దలు తెలంగాణ నేతలను ఢిల్లీ రావాల్సిందిగా  ఎందుకు  ఆదేశించారని రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇప్పట్లో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు. ఐనా అధిష్టానం తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలిపించారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీలో ఎంపీలు ఉన్నారు. పార్టీకీ చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరిని ఒకేసారి పిలిచి పార్టీ పెద్దలు ఏం మాట్లాడదలుచుకున్నారో అని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

తెలంగాణ నేతలతో ఏకంగా ప్రధానీ మోదీ సమావేశం అవడం సంచలనంగా మారుతుంది. ప్రధానీ మోదీతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ చాలా ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో బీజేపీకీ ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని గ్రహించిన బీజేపీ పెద్దలు పార్టీనీ మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెడితే విజయం ఖాయమని గ్రహించిన బీజేపీ హైకమాండ ఇక తెలంగాణపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. పార్టీ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని గుర్తించిన అధిష్టానం త్వరలోనే ఆ దిశగా కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. నేతల తీరుపై ప్రధానీ మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మీ తీరుతో పార్టీకీ ఆదరణ ఉన్నా బలోపేతం చేయలేకపోతున్నామని నేతలతో అన్నట్లు తెలిసింది.

ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంలో తెలంగాణ బీజేపీ నేతలు వెనుకపడ్డారనే భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు. బీజేపీ కన్నా బీఆర్ఎస్ దూకుడుగా వెళుతుందని అవకాశం ఉండి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారనే అసంతృప్తిలో పార్టీ పెద్దలు ఉన్నారు.దీనిని చక్కబెట్టడానికే నేతలను ఢిల్లీకీ పిలిపించినట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్ర అధ్యక్షుడి పదవి, బీజేపీ ఎల్పీ నేత పదవి పార్టీలో పెద్ద చిచ్చు రాజేస్తున్నట్లు అంతర్గతంగా చర్చ జరుగుతుంది. పార్టీల్లో నేతల అసంతృప్తి వల్లే ఇన్ని రోజులు ఈ పదవుల భర్తీనీ పెండింగ్ పెట్టారని తెలంగాణ నేతల్లో టాక్. ప్రస్తుతం భేటీ నేపథ్యంలో ఇక ఈ పదవుల అంశానికి కూడా బీజేపీ అధిష్టానం పులిస్టాప్ పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల నేతలు వ్యక్తిగతంగా ఎవరికి వారే అన్నట్లుగా ఆందోళనలు చేస్తున్నారు తప్పా..పార్టీ పరంగా ఆందోళనలు చేపట్టడం లేదని పార్టీ పెద్దలకు సమాచారం ఉంది. కొందరు నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పా పార్టీనీ బలోపేతం చేయాలన్న విషయాన్ని మరిచారనే అసంతృప్తిలో పార్టీ ఉంది. ఇటీవల తెలంగాణలో జరిగిన సభ్యత్వ నమోదులో దీనిని అధిష్టానం గ్రహించింది. దీనికి ఎలాగైనా చెక్ పెట్టాలనే భావనతో  మోదీ, అమిత్ షా ద్వయం ఉంది. పార్టీనీ ఇలాగే వదిలేస్తే పూర్తిగా చేజారిపోతుందని ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉంది. అందుకే ముందు జాగ్రత్తలో భాగంగా హై కమాండ్ దృష్టి సారించింది. త్వరగా పార్టీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలని అటు తర్వాత పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని తెలంగాణ నేతలకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది.  

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ హై కమాండ్ ను కొంత మేర సంతృప్తి పరిచాయి. పార్టీ పూర్తి స్థాయిలో పని చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం అనే భావనలో ఉంది. అందుకే ఇప్పటి నుంచే తెలంగాణ మీద అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అంతే కాదు తెలంగాణకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నేతల అభిప్రాయాలను తీసుకునే క్రమంలో భాగంగా నేతలను ఢిల్లీకీ పిలిపించినట్లు మరో ప్రచారం ఉంది. ఎందు కంటే రాజాసింగ్ లాంటి అసంతృప్త నేతలు సైతం ఢిల్లీకీ వెళ్లారంటే అధిష్టానం ఏదో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. 

మొత్తానికి తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన మాత్రం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని మాత్రం చెప్పాలి. ఈ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున మార్పులు ఉండే అవకాశం లేకపోలేదని కాషాయ నేతల్లో తెగ ప్రచారం జరుగుతుంది. ప్రధానితో భేటీలో తెలంగాణ నేతలకు ఏం చెప్పారు, తెలంగాణ నేతలు ఏ ఏ అంశాలు మోదీ దృష్టికి తీసుకువచ్చారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.  

ఇది చదవండి: Rajya Sabha Election: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం.. ఈసీ షెడ్యూల్‌ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News