అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 17వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టు సూచించింది. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యచరణను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు అందజేసింది. అఫిడవిట్ పరిశీలించిన హైకోర్టు ఎన్నికల నిర్వహణకు అనుమతినిస్తూ, జనవరి 17న నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించింది.
ఫిబ్రవరి 10న ఎన్నికల ఫలితాలు విడుదల చేయాలని పేర్కొంది. మొత్తంగా ఫిబ్రవరి 15లోపు ఈ ప్రక్రియ ముగించాలని సూచించింది. ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, మార్చి 3వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని కోర్టు సూచించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో జనవరి 10న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులతో త్వరలోనే సమావేశం కానున్నట్లు కోర్టుకు ఎన్నికల సంఘం అఫిడవిట్‌లో పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..