ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ .. ISRO ఛైర్మన్ కె. శివన్ .. కొత్త ఏడాది సందర్భంగా కొత్త ప్రాజెక్టులు ప్రకటించారు. చంద్రయాన్ - 2 ప్రయోగం తర్వాత ఇస్రో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోందని చెప్పారు. మిషన్ చంద్రయాన్-3కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టుపై పని చేస్తున్నారని తెలిపారు. చంద్రయాన్-3 కోసం దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని అంచనా వేసినట్లు శివన్ వివరించారు.
ఆర్బిటర్ పని చేస్తోంది..
చంద్రయాన్-2 కు సంబంధించి కూడా మరిన్ని విశేషాలు అందించారు ఇస్రో ఛైర్మన్ కె. శివన్. మిషన్ చంద్రయాన్- 2 విజయవంతం కాకపోయినప్పటికీ ప్రస్తుతం ఆర్బిటర్ ఇప్పటికీ పని చేస్తూనే ఉందని తెలిపారు. వచ్చే 7 సంవత్సరాల వరకు అది పని చేస్తూనే ఉంటుందని ఆయన వివరించారు. విక్రమ్ ల్యాండర్ ఢీకొట్టిన చోటును గుర్తించిన చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్రహ్మణియన్ ను ఇస్రో ఛైర్మన్ అభినందించారు. భారత్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ గగన్ యాన్ కు కూడా త్వరలోనే అడుగు పడనుంది. ఇప్పటికే ఈ గగన్ యాన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన వారందరికీ రష్యాలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
ఇస్రో విస్తరణ
ప్రస్తుతం ఉన్నఇస్రోను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. రెండో ఇస్రో స్పేస్ పోర్ట్ కూడా భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. దీన్ని తమిళనాడులోని తూత్తుకూడిలో నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఇస్రో కొత్త ప్రాజెక్టులివేనా..?