గణేష్ నిమజ్జనంలో బోటు మునిగి 11 మంది మృతి

గణేష్ నిమజ్జనంలో బోటు మునిగి 11 మంది మృతి

Last Updated : Sep 13, 2019, 06:02 PM IST
గణేష్ నిమజ్జనంలో బోటు మునిగి 11 మంది మృతి

భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలోని ఖట్లాపుర ఘాట్ వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు నిమజ్జనానికి వెళ్లిన ఓ బోట్ నీటిలోనే మునిగిపోయిన దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురిని సహాయక బృందాలు కాపాడాయి. గణేశ్ నిమజ్జనం కోసం 16 మందిని తీసుకెళ్తున్న బోటు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయిందని.. ఘటనాస్థలం వద్ద ఇంకా సహాయచర్యలు కొనసాగుతున్నాయని ఏఎస్పీ అఖిల్ పటేల్ తెలిపారు. బోటు కెపాసిటీకి మించి జనం, భారీ విగ్రహాలను తీసుకెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది. 40 మంది పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా అధికార యంత్రాంగం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు అఖిల్ పటేల్ వెల్లడించారు. 

11 మందిని పొట్టనబెట్టుకున్న ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పీసీ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించిన మంత్రి... ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని అన్నారు.

Trending News