ఎంఎస్ ధోనీ భవితవ్యంపై టీమిండియా మాజీ కెప్టేన్ అనిల్ కుంబ్లే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా జట్టులో ధోనీని ఇంకా కొనసాగించాలా లేదా అనే విషయమై బీసీసీఐ సెలెక్టర్లు చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్న అనిల్ కుంబ్లే.. ఒకవేళ ధోనిని కొనసాగించొద్దనుకుంటే అతడికి గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేయండి అని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా ధోనీ లాంటి గొప్ప ఆటగాడికి ఘనంగా వీడ్కోలు పలికాల్సిన అవసరం మాత్రం ఉందని అనిల్ కుంబ్లే స్పష్టంచేశాడు. ధోని రిటైర్మెంట్ గురించి అనిల్ కుంబ్లే ఓ క్రికెట్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మహేంద్ర సింగ్ ధోని స్థానంలోనే జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రతిభ గురించి కుంబ్లే మాట్లాడుతూ.. పంత్ పర్ఫార్మెన్స్ సరిగా లేదని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లలో రిషబ్ పంత్ నిలకడగా ఆడటం లేదని కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో ధోనిని కొనసాగించాలా లేక వీడ్కోలు పలకాలా అనే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సెలెక్టర్లకు కుంబ్లే సూచించాడు.