హైదరాబాద్: జగన్ వంద రోజుల పాలనలో 110 తప్పులు చేశారని బీజేపి ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. అమరావతి, పోలవరం పనులు నిలిపివేయడం, విద్యుత్ ఒప్పందాల రద్దు చేయడం వైసీపీ ప్రభుత్వం విజయంగా భావిస్తుందా ? అని ప్రశ్నించిన సుజనా చౌదరి.. ఏపీలో వంద రోజులుగా అన్యమత ప్రచారం ఎక్కువైందని అన్నారు. గత 100 రోజుల్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన చాలా మంది పారిశ్రామికవేత్తలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెనక్కి వెళ్లిపోయారని సుజనా చౌదరి మండిపడ్డారు. వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై స్పందిస్తూ సుజనౌ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. పథకాల పేర్లు మారిస్తే తప్పులేదు కానీ.. ఆ పథకాలనే నిలిపేయడం సరికాదని సుజనా చౌదరి అన్నారు.
ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్ల పోస్టుల నియామకాన్ని ప్రస్తావించిన సుజనా చౌదరి.. వైసీపి కార్యకర్తలకే ఆ పోస్టులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కీలకమైన పదవుల నియామకం విషయంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు దొందూ దొందే అని, ఒకే సామాజిక వర్గానికే కీలకమైన పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతి భూములపై తన సవాల్‌ను స్వీకరించే ధైర్యం వైసీపీకి లేదని సుజనా చౌదరి సవాల్ విసిరారు.
వైసీపీకి సుజనా చౌదరి సవాల్ !