అమేథి: రాహుల్ గాంధీ అమేథీలో గత 15 ఏళ్లుగా చేయని పనిని తాను చేస్తున్నానని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని అన్నారు. అమేథిలో తాను ఓ సొంత నివాసం నిర్మించుకోదల్చుకున్నట్టు శనివారం స్మృతి ఇరాని ప్రకటించారు. అంతేకాకుండా గౌరిగంజ్లో అందుకోసం ఓ ఫ్లాట్ కూడా చూశానని ఆమె స్పష్టంచేశారు. ఇకపై అమేథినే తన శాశ్వత నివాసమని, నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్మృతి ఇరాని హామీ ఇచ్చారు. అమేథి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన అనంతరం శనివారం తొలిసారిగా నియోజకవర్గ పర్యటనకు వచ్చిన స్మృతి ఇరాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్న సందర్భంగా స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా తాను అమేథిలోనే ఉంటానని ఆమె ఈ ప్రకటన ద్వారా చెప్పకనే చెప్పారు.
1999 నుంచి 2004 వరకు సోనియా గాంధీ అమేథి నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించగా ఆ తర్వాత 2004 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే, గత 20 ఏళ్లలో అటు సోనియా గాంధీ కానీ లేదా ఆ తర్వాత రాహుల్ గాంధీ కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు అమేథిని సందర్శించినా.. అక్కడి అతిథి గృహాల్లో ఉండి వెళ్లడమే కానీ అక్కడ వారికి స్థిర నివాసం లేదు. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీపై స్మృతి ఇరాని విమర్శలు గుప్పించారు.