గుంటూరు: వైఎస్సార్సీపీ అగ్ర నేత విజయసాయి రెడ్డి తనపై చేసిన విమర్శలు, ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తాను తొలి స్పీకర్‌గా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్న కోడెల.. తనను అప్పటి అధికార, ప్రతిపక్ష నాయకులే ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆ పదవిలో కూర్చోబెట్టారని గుర్తుచేసుకున్నారు. స్పీకర్‌గా తానెప్పుడూ తప్పుడు పనులు చేయలేదని, అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించానని అన్నారు. తన కుటుంబసభ్యులు ఎవ్వరూ రాజకీయాల్లోకి రారని పునరుద్ఘాటిస్తూ వారిపై తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోవడం ఎంతమేరకు సమంజసం అని కోడెల ప్రశ్నించారు. బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోడెల ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తాను అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజార్చానని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారని, తమ కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలంటూ రెచ్చగొట్టే ధోరణిలో ఆయన మాట్లాడినందువల్లే ఇవాళ తన కుటుంబసభ్యులపై కేసులు నమోదవుతున్నాయే తప్ప ఇందులో ఇంకేమీ లేదని వివరణ ఇచ్చారు. విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే తాను ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసినట్టు కోడెల శివప్రసాద్ రావు తెలిపారు.