తిరువనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు కేరళ వెళ్లి అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. తిరువనంతపురం కేరళ ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌజ్‌లో ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపి, కాంగ్రెస్‌లను మట్టికరిపించి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌నే అధికారంలోకి తీసుకురావాలని గత ఏడాది కాలంగా దేశంలోని ఇతర పార్టీల నేతలకు కేసీఆర్ పిలుపునిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గతంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌లతో భేటీ అయిన ఆయన ఇవాళ తిరువనంతపురం వెళ్లి పినరయి విజయన్ను కలిశారు.
ఇదే పర్యటనలో భాగంగా తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ స్వామి వారిని దర్శించుకుని వేద పండితుల ఆశీస్సులు పొందారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, మనవడు, మనవరాలు, సమీప బంధువు, ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ సీనియర్ ఎంపీ వినోద్ ఉన్నారు.