ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మావోయిస్టులు మరోమారు తమ ప్రాబల్యాన్ని చూపించారు. ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిచ్చిన నక్సల్స్ ఈ రోజు దంతెవాడ జిల్లాలో బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుమక్‌పాల్-నయనార్ రోడ్డుపై ఐఈడీని పేల్చారు. పోలింగ్ విధులు నిర్వహించడానికి వెళ్తున్న సిబ్బంది, పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకొనే ఈ దాడి చేసిననట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది.
అందరూ సురక్షితంగానే పోలింగ్ కేంద్రాలకు చేరారని పోలీసులు తెలిపారు. ఆదివారం కూడా ఎన్నికలు బహిష్కరించమని పిలుపునిస్తూ ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. 90 స్థానాలు ఉన్న శాసనసభ తొలిదశలో బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తార్, సుక్మా, రాజనందగావ్, దంతెవాడ జిల్లాలలోని 18 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా నక్సల్స్ ప్రాబల్యం బాగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, రాష్ట్ర మంత్రులు కేదార్ కశ్యప్, మహేశ్ గగ్దా మొదలైన వారు ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. రెండో దశ పోలింగ్ 72 స్థానాలకు జరుగుతుందని.. ఈ నెల 20న పోలింగ్ ఉంటుందని ఇప్పటికే ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఫలితాలు డిసెంబరు 11వ తేదిన వెలువడతాయని కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.