మహాకూటమి పేరుతో తెలంగాణ ఎన్నికలలో బరిలోకి దిగాలని భావిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది మహాకూటమి కాదని.. మోడరన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని.. తెలంగాణను దోచుకోవాలని వస్తున్న ఈ కూటమిని తరిమికొట్టాలని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ.. సంగారెడ్డి ప్రాంతంతో ప్రసంగించిన అసదుద్దీన్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. విజయవాడలో ఉంటూ తెలంగాణను శాసించాలనుకొనే చంద్రబాబును.. నాగపూర్ కేంద్రంగా తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూస్తున్న బీజేపీ పార్టీని, ఢిల్లీ కేంద్రంగా పనులు చేస్తూ తెలంగాణను దోచుకు తినాలని భావించే కాంగ్రెస్ పార్టీని వదలకూడదని.. బుద్ధి చెప్పాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును.. తెలంగాణ రాష్ట్ర ప్రజలే నిర్దేశించుకోవాలి తప్పితే.. పరాయి రాష్ట్రాల వారు నిర్దేశించకూడదని అసదుద్దీన్ తెలిపారు. ఏపీలో కూడా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని.. బీజేపీ నుండి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. అదే బీజేపీ పార్టీ ముస్లిం మైనారిటీలను కాల్చి చంపితే ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు.
తెలంగాణలో మహాకూటమి గెలిస్తే .. వారు తప్పకుండా బీజేపీతో కలుస్తారని అసదుద్దీన్ తెలిపారు. అందుకే మోసపూరితమైన ఈ కూటమి బారి నుండి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీలకు చేస్తున్న మేలు గతంలో ఏ ఇతర ప్రభుత్వం కూడా చేయలేదని.. అందుకే తాము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని అసదుద్దీన్ తెలిపారు. తెలంగాణ మిశ్రమ సంస్కృతిని కాపాడే ఉదాత్త వైఖరి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేదని.. అది టీఆర్ఎస్ వల్లే సాధ్యమని అసదుద్దీన్ అన్నారు.