Vyuham Shapatham Movie Trailer: ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన 'వ్యూహం, శపథం' సినిమాలకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ విడుదల చేశాడు. 'ఇదిగో డబుల్ డోస్' అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్రైలర్‌ను విడుదల చేయడం గమనార్హం. ఆసక్తికర విషయాలతో ఈ ట్రైలర్ విడుదల కాగా ఏపీ రాజకీయాల్లో ఈ సినిమా తీవ్ర చర్చకు తెరలేపే అవకాశం ఉంది. ఏపీలో చంద్రబాబు, జగన్ పాత్రలపై ప్రధానంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ ఆర్జీవీ 'ఎక్స్'లో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేశాడు. 'ఇదిగో వ్యూహం, శపథం డబుల్ డోస్ ట్రైలర్' అంటూ పోస్టు చేశాడు.
Also Read: Mrunal Thakur: రూట్ మారుస్తున్న మృణాల్…ప్రయోగాలు అవసరమా అంటున్న అభిమానులు..
అనేక వివాదాలతో మలుపులు తిరిగిన ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా ఈనెల 23వ తేదీన విడుదల కానుంది. వైఎస్సార్ మరణం నుంచి జగన్‌పై జరిగిన కుట్రలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తుల వరకు వ్యూహం సినిమా ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. రెండో భాగం 'శపథం' జగన్ అధికారంలోకి రావడం.. ఆ తర్వాత తాజా పరిణామమైన చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం కూడా చూపించారు. 'జగన్‌ను కిందకు లాగడానికి మనకు అతను కావాలి' అంటూ పవన్‌కల్యాణ్ ఉద్దేశిస్తూ చంద్రబాబు పాత్రధారి మాట్లాడుతూ ట్రైలర్ ప్రారంభమైంది. 'పాము, మొసలి అంటే ఎక్కువ భయమెందుకు వేస్తుంది. వాటికళ్లలో ఎమోషన్స్ ఉండవు. అచ్చం అలాంటి ఎమోషన్స్ లేని మూడో జీవి చంద్రబాబు' అంటూ జగన్ పాత్ర డైలాగ్ పలుకుతుంది.
కల్పితం కాకుండా నేరుగా ఏపీ రాజకీయాలను వాస్తవరూపంలో చూపించే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. పాత్రల పేర్లు కూడా మార్చకుండా వ్యక్తిగత పేర్లు పెట్టేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో 'వ్యూహం' గతేడాది నవంబర్ 13వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు విడుదలకు సిద్దమైంది. అన్ని అభ్యంతరాలు తొలగించుకుని తొలి భాగం 'వ్యూహం' సినిమా ఈనెల 23న విడుదల కానుండగా.. రెండో భాగం 'శపథం' మార్చి 1వ తేదీన థియేటర్లలో రానుంది.
జగన్ పాత్రలో అజ్మల్ అమీర్, భారతి పాత్రలో మానస రాధకృష్ణన్ నటిస్తుండగా.. ఆర్జీవీ దర్శకత్వం వహించగా దాసరి కిరణ్ కుమార్ నిర్మాణంలో సినిమా తెరెక్కింది. సంగీతం ఆనంద్ అందించగా, డీఓపీ సతీశ్ రాజేంద్రన్, ఎడిటింగ్ మనీశ్ ఠాకూర్ చేశారు. కాగా ఈ సినిమాను తెలుగుదేశం, జనసేన పార్టీలు అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. తమ అధినేతలను నెగటివ్ పాత్రలో చూపించారని ఆరోపిస్తూ విడుదలను అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేశ్ ఈ సినిమా విడుదలను న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయగా ఫలించలేదు. ఇప్పుడు థియేటర్లలోనైనా అడడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే యాత్ర సినిమాతో ఏపీ రాజకీయాలు వేడెక్కగా.. ఇప్పుడు ఆర్జీవీ సినిమాలతో మరింత రసవత్తరంగా మారనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook