Lok Sabha Elections: ఇండియా కూటమిలోని కీలకమైన తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సొంతంగా పోటీ చేస్తాయని బుధవారం ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిసేపటికే పంజాబ్ ముఖ్యమంత్రి అదే ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని మా పార్టీ నిర్ణయించిందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. చండీగడ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీడియా మమత తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించగా.. 'పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదు. పంజాబ్‌లోని 13 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుంది' అని ప్రకటించారు.
'అత్యధిక స్థానాలు గెలుపొంది దేశంలో హీరోగా నిలుస్తాం' అని భగవంత్ మాన్ తెలిపారు. 13 స్థానాలకు ఎంతో మంది పోటీ పడుతున్నారని, కానీ 40 మందిని తుది జాబితాకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 'ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు గుర్రాలపై మేం మరోసారి సర్వే చేస్తాం. ఒక స్థానం నుంచి ఇద్దర ముగ్గురిని పరిశీలిస్తున్నాం. జలంధర్‌లో మాత్రం సిట్టింగ్ ఎంపీ మరోసారి పోటీ చేస్తారు' అని భగవంత్ మాన్ వివరించారు.
ఇండియా కూటమి కుదేలు
ఒకే రోజు రెండు పార్టీలు సొంత నిర్ణయాలు ప్రకటించడంతో ఇండియా కూటమి కుదేలైంది. మొదటి నుంచి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించడం కలకలం రేపింది. పదేళ్లుగా నియంతలా పాలిస్తున్న మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. నాలుగైదు కూటమి సమావేశాలు కూడా సజావుగా జరిగాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ రెండు పార్టీలు సొంత దారి చూసుకోవడంతో కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీలో పొత్తుకు సరే కానీ రాష్ట్రాల్లో పొత్తుకు ఆయా పార్టీలు నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్, పశ్చిమబెంగాల్లో ఆయా పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆ రెండు పార్టీల నిర్ణయం పరిశీలిస్తే.. ఎన్నికల వరకు ఒంటరిగా పోటీ చేసి.. ఫలితాల అనంతరం కూటమి విషయం ఆలోచిద్దామనే ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది.
#WATCH | On TMC leader Mamata Banerjee saying "Will fight alone" during Lok Sabha polls in Bengal, Punjab CM & AAP leader Bhagwant Mann says, "...In Punjab, we will not do anything (alliance with Congress) like that, we have nothing with Congress." pic.twitter.com/JVBY8FtjJV
— ANI (@ANI) January 24, 2024
దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్
పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే యూపీఏ స్థానంలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటుచేసింది. ఏర్పాటైన నాటి నుంచి కూటమిలో విబేధాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయం ముంచుకురావడంతో పార్టీలన్నీ సొంత నిర్ణయాలు తీసుకుంటుండడంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవుతోంది. ఒక తాటిపైకి తీసుకొచ్చినా పార్టీల మధ్య ఐక్యత తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీనికితోడు సీట్ల సర్దుబాటులో ఆయా పార్టీలు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అందులో భాగంగా 'ఒంటరిగా పోటీ' అని ఆయా పార్టీలు నిర్ణయం తీసుకుంది. ఇరు పార్టీల నిర్ణయంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో ఉంది.
Also Read: Sharmila fire on Jagan: బీజేపీతో అన్నయ్య కుమ్మక్కు.. సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
Also Read: Parliament Elections: కాంగ్రెస్‌కు మమత భారీ షాక్.. బెంగాల్లో కటీఫ్.. ఢిల్లీలో దోస్తీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook