Polavaram project: ఏపీ ప్రజల జీవనరేఖగా పిలుస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇటీవల వరుసగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీకు లాభిస్తున్నాయి. మొన్నటి వరకూ నిరాకరించిన తాగునీటి విభాగం పనుల నిధుల్ని..ఇప్పుడు ఇచ్చేందుకు అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో ఒక్కొక్క అంశంపై పట్టు వదులుతోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివే. సాధారణంగా పోలవరం ప్రాజెక్టు అంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాసం, పరిహారం, సాగునీటి కాలువలతో పాటు తాగునీటి కాలువలు కూడా అంతర్భాగంగా ఉంటాయి. కానీ పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా విభాగం ఖర్చులు తమకు సంబంధం లేదని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చింది. ఈ విషయంపైనే ఇన్నాళ్లూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..కేంద్ర ప్రభుత్వంపై పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది. పోలవరం తాగునీటి విభాగం ఖర్చులు కూడా భరిస్తామని అంగీకరించింది.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి సంబంధించిన 55 వేల 548 కోట్ల రూపాయల నిధుల గురించి ప్రశ్నించినప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. మిగిలిన పనుల్ని పూర్తి చేసేందుకు 10 వేల 911 కోట్లను , వరదల కారణంగా దెబ్బతిన్న భాగాల మరమ్మత్తుల కోసం మరో 2 వేల కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దాంతోపాటు తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆర్ధిక శాఖకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి తెలిపారు.
ఇక మిగిలింది పోలవరం పునరావాసం, పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఇంకా కొద్దిగా పేచీ మిగిలుంది. ఇది కూడా పరిష్కారమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చకచకా పూర్తి కావచ్చు.
Also read: CM YS Jagan Mohan Reddy: విశాఖలో ఇనార్బిట్ మాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన.. 8 వేల మందికి ఉద్యోగాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook