Singer Sai Chand Passed Away: ఉద్యమకారుడిగా, గాయకుడిగా తనదైన ముద్ర వేసిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్‌కు వచ్చిన ఆయన.. అక్కడే గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. సాయిచంద్ మరణించినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1984లో వనపర్తి జిల్లాలోని అమరచింత గ్రామంలో జన్మించిన సాయిచంద్.. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. తండ్రి వెంకట్రాములు మార్గంలో నడుస్తూ.. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ.. ప్రజలను చైతన్య పరిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమకాంక్షను రగిలించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ పథకాలను తన ఆట పాటలతో ప్రజల్లో ప్రచారం చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన అన్ని సభల్లోనూ తన పాటలతో చైతన్యం నింపారు సాయిచంద్. 2019లో నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరుఫున టికెట్ ఆశించారు. అయితే సాయి చంద్‌కు టికెట్ దక్కలేదు.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి సాయిచంద్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం మొదట ఖరారు చేసింది. అయితే అభ్యర్థుల జాబితాలో మార్పులతో ఆఖరి నిమిషంలో సాయిచంద్ పేరును తొలగించాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ పదవికి ఇవ్వకపోయినా.. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్‌గా సాయిచంద్‌ను కేసీఆర్ నియమించారు. అప్పటి నుంచి ఆయన ఆ పదవిలోనే కొనసాగుతున్నారు.
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాటతో సాయిచంద్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాటు పలు ఫేమస్ సాంగ్స్ పాడారు. సాయిచంద్ మరణంపై బీఆర్ఎస్ నేతలు, అభిమానులు, కళాకారులు సంతాపం తెలుపుతున్నారు. మీ స్వరానికి మరణం లేదు.. పాట ఉన్నంత వరకు మీరు మాతోనే ఉంటారు.. అంటూ సోషల్ మీడియా వేదికగా సాయిచంద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook