ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 329 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా టెయిలెండర్ల నుండి పెద్దగా ఫలితం రాకపోవడంతో పాటు వికెట్లు కూడా వరుసగా పడడంతో.. . కేవలం ఆరు పరుగుల తేడాతో భారత జట్టు చివరి నాలుగు వికెట్లను చేజేతులా పోగొట్టుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ భారీ స్కోరు దిశగా వెళ్తున్న భారత్ ఆశలను అడియాసలు చేశారు. బ్యాట్స్‌మెన్‌ను వరుస స్వింగ్ బంతులతో అయోమయానికి గురిచేయడానికే తమ ప్రతిభనంతా ఉపయోగించారు.
తొలి ఇన్నింగ్స్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. ఇంగ్లాండ్‌లో చేసిన అత్యధిక తొలి ఇన్నింగ్స్ స్కోరు ఇదే (329)కావడం ఆశ్చర్యం. తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు, 307/6తో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన భారత్‌కు బ్రాడ్ చుక్కలు చూపించాడు. క్రీజులో అప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లను పూర్తిగా అయోమయానికి గురిచేశాడు. ముఖ్యంగా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (24; 51 బంతుల్లో 2×4, 1×6) అర్ధశతకం సాధించకముందే బ్రాడ్ అతన్ని ఔట్ చేసేశాడు.
క్రీజులోకి రాగానే రెండు బౌండరీలు సాధించిన అశ్విన్ (14; 17 బంతుల్లో 3×4)ను కూడా బ్రాడ్ వేగంగానే ఔట్ చేశాడు. లేట్ ఇన్‌స్వింగర్‌ను ఆడబోయి అశ్విన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ షమి, (3; 5 బంతుల్లో), జస్ప్రీత్ బుమ్రాల (0; 1 బంతుల్లో)ను అండర్సన్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపించడంతో భారత్ కేవలం 329 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి 46/0 స్కోరుతో ఉంది. కుక్, కీటన్ జెన్నింగ్స్ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టులో విరాట్ కోహ్లీ (97), రహానే (81), శిఖర్ ధావన్ (35) మాత్రమే రాణించారు.