వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు: పాక్ కితాబు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతికి దాయాది దేశం పాకిస్థాన్ నివాళులర్పించింది.

Last Updated : Aug 17, 2018, 10:53 AM IST
వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు: పాక్ కితాబు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతికి దాయాది దేశం పాకిస్థాన్ నివాళులర్పించింది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతి చెందారనే వార్త తమనెంతో విషాదంలో ముంచేసిందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌-పాక్‌ సంబంధాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయిని కొనియాడింది. ఇండో-పాక్ మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు వాజ్‌పేయి చేసిన కృషిని పాక్ గుర్తుచేసుకుంది. సార్క్ దేశాల తరఫున ప్రధాన మద్దతుదారుడిగా వ్యవహరిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి ఆయన ఎంతో సహకారం అందించారని కొనియాడింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల భారత ప్రభుత్వానికి, ప్రజలకు పాకిస్థాన్ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.

వాజ్ పేయికి ఇమ్రాన్ ఖాన్ నివాళి

ఉప ఖండంలో వాజ్‌పేయి గొప్పనేత అని, ఆయన భారత్-పాక్ సంబంధాలను మెరుగుపరిచేందుకు చేసిన కృషి, పడిన తపన ఎప్పటికీ గుర్తుంటుందని పాకిస్థాన్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

 

పాకిస్థాన్‌ను శత్రువుగా చూడక.. ఆ దేశంతో విభేదాలను పరిష్కరించేలా 1999లో ఢిల్లీ-లాహోర్ బస్సును వాజ్‌పేయి ప్రారంభించారు. కాశ్మీర్ అంశ పరిష్కారంకై పాక్‌ను చర్చలకు ఆహ్వానించారు. అటల్‌ది మెతక వైఖరే అనుకొని 1999లో పాక్ ఉగ్రవాదులు, సైనికులు కార్గిల్‌లోకి చొరబడితే.. యుద్ధంలో భారత సైన్యానికి అన్నిరకాలుగా సాయం అందించి దాయాది మూకను సరిహద్దుల అవతలికి తరిమికొట్టించారు.. ఓడిపోయాయని ఒప్పుకొనేలా చేశారు వాజ్‌పేయి.

Trending News