2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీమాస్ తరఫున ప్రజాగాయకుడు, విప్లవ కవి గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావును కేసీఆర్‌కు పోటీగా నిలబెడతామని టీమాస్ రాష్ట్ర కన్వీనర్ కంచె ఐలయ్య తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో బహుజనులకు రాజ్యాధికారం అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న ఐలయ్య ఈ విషయాన్ని తెలిపారు.
దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ ప్రజలను నిలువు దోపిడీ చేశారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణకి అసలైన న్యాయం కేసీఆర్ పై గద్దర్‌ను పోటీగా నిలబెడతేనే జరుగుతుందని ఐలయ్య అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో వెలమలు, రెడ్డి కులస్థులు ముఖ్యమంత్రులుగా ఉండడానికి వీల్లేదని.. కచ్చితంగా దళితులకే తాము పట్టం కట్టితీరుతామని అన్నారు. టీమాస్ పొలిటికల్ ఎజెండాలో కూలి బంధు పథకం ఉందని ఐలయ్య అన్నారు. నిరుపేదలను కార్యోన్ముఖులను చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం తాము గద్దర్‌ని సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తున్నామని తెలిపారు.
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో పనిచేస్తున్న 280 సంఘాలూ, సంస్థలూ తెలంగాణ గడ్డపై కలసి టీమాస్ (తెలంగాణ మాస్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్)ను స్థాపించాయి. బీసీ సబ్‌ప్లాన్ సాధనకోసం, అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ)కు న్యాయం కోసం ఈ టీమాస్‌ను స్థాపించామని గతంలో ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. అగ్రవర్ణాల వారే అధికారాన్ని చెలాయిస్తుండడంతో.. నిమ్న జాతులకు న్యాయం జరగడం లేదని,,. దశాబ్దాల కాలం నుండి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదని.. అందుకే టీమాస్ ఆవిర్భవించిదని గతంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ తెలిపారు.
తెలంగాణలో వారి సీఎం అభ్యర్థి.. గద్దర్