భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీత వీఎస్‌ నైపాల్‌ కన్నుమూత

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత వీఎస్‌ నైపాల్‌ (85) కన్నుమూశారు.

Last Updated : Aug 12, 2018, 05:11 PM IST
భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీత వీఎస్‌ నైపాల్‌ కన్నుమూత

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత వీఎస్‌ నైపాల్‌ (85) కన్నుమూశారు. లండన్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలియజేశారు. నైపాల్‌ పూర్తిపేరు విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌.  'ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిస్వాస్‌', 'మిమిక్‌ మెన్‌', 'ఎ బెండ్‌ ఇన్‌ ద రివర్‌', 'ఇన్‌ ఎ ఫ్రీ స్టేట్‌', 'యన్‌ ఏరియా ఆఫ్‌ డార్క్‌నెస్‌', 'ది ఎనిగ్మా ఆఫ్‌ ద ఎరైవల్‌' వంటి రచనలు రాశారు నైపాల్‌.

వీఎస్‌ నైపాల్‌ 17 ఆగస్టు 1932లో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో జన్మించారు. 20ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌కు వలస వచ్చిన ఆయన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. ఆయన జీవితకాలం ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. 30కిపైగా రచనలు చేసిన నైపాల్ సాహిత్యంలో చెరగని ముద్రవేశారు. పురుటి గడ్డ కోసం పడే తపన నైపాల్‌ రచనల్లో కనిపిస్తుంది. ఆయనకు 2001లో నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది.

1962లో నైపాల్ భారతదేశానికి వచ్చారు. తన పూర్వీకుల స్వస్థలాన్ని సందర్శించారు. నైపాల్‌  'ఏరియా ఆఫ్ డార్క్‌నెస్ (హిజ్ డిస్కవరీ ఆఫ్ ఇండియా) 'పుస్తకాన్ని రచించగా.. అది 1964లో భారతదేశంలో వివాదాస్పదమై బహిష్కరించబడింది. ఉత్తర భారతదేశానికి చెందిన నైపాల్‌ హైదరాబాద్‌ వచ్చారు. సామాజిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేశారు. నక్సల్స్‌ ప్రభావ ప్రాంతాలకు పోలీసు అధికారులతో మాట్లాడారు. విప్లవ రచయితలను కలిశారు.

Trending News