Telangana Youth Congress: బంజారాహిల్స్లో యువజన కాంగ్రెస్ విభాగం నిర్వహిస్తున్న సోషల్ మీడియా వార్ రూమ్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు ఈ ఆకస్మిక తనిఖీల అనంతరం విలువైన డేటాతోపాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఎంతో కీలకమైన పాత్ర పోషించింది అని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ వార్ రూమ్ లో పోలీసులు తనిఖీలు చేపట్టడం చర్చనియాంశమైంది.
ఇదిలావుంటే ఈ ఘటనను యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ ఎలాగైతే పనిచేసిందో.. అలాగే తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇక్కడి యూత్ కాంగ్రెస్ అలాగే పనిచేస్తోందని.. అందుకే యూత్ కాంగ్రెస్ పనితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళనకు గురవడం వల్లే తమని దెబ్బ కొట్టడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ సర్కారుపై, సైబరాబాద్ పోలీసుల తీరుపై శివసేనా రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదారాబాద్ యూత్ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో తమ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం అదే పనిగా కృషి చేస్తోందని.. తమ పని సక్సెస్ అవుతుందేమోననే భయంతోనే సీఎం కేసీఆర్ ఇలా బంట్రోతులను తమపైకి ఉసిగొల్పారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ దొంగ నాటకాలు యూత్ కాంగ్రెస్ పని తీరును అడ్డుకోలేవు. పోలీసులు ఎలాంటి సమాచారం, సెర్చ్ వారెంట్ లాంటి నోటీసులు ఇవ్వకుండానే దాడులు చేసి ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లడం దుర్మార్గం.. చట్ట విరుద్ధం అవుతుంది అని శివసేనా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు అని అన్నారు.