విశ్వరూపం2 మూవీ రివ్యూ

విశ్వరూపం2 మూవీ రివ్యూ 

Last Updated : Aug 10, 2018, 04:12 PM IST
విశ్వరూపం2 మూవీ రివ్యూ

నటీనటులు : కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌
సంగీతం : మహమ్మద్‌ గిబ్రాన్‌
పాటలు: రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌,
ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌
రచన, దర్శకత్వం : కమల్‌ హాసన్‌.
విడుదల తేది : 10 ఆగస్ట్ 2018

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఐదేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా ‘విశ్వరూపం2’ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చాడు కమల్. మరి ఈ సినిమా ‘విశ్వరూపం’ను మించి ఉందా..? హీరోగా దర్శకుడిగా కమల్ తన విశ్వరూపం చూపించాడా..? ఈ రివ్యూలో చూద్దాం. 

కథ :
‘విశ్వరూపం’ సినిమాకు సీక్వెల్‌గా ‘విశ్వరూపం 2’ తెరకెక్కింది. ‘విశ్వరూపం’లో న్యూయార్క్‌ మిషన్‌ పూర్తి చేసిన విసామ్ (కమల్‌ హాసన్‌), మరో మిషన్‌ మీద లండన్‌ వెళ్తాడు. లండన్‌లో భారీ విధ్వంసానికి జరుగుతున్న కుట్రను తన భార్య నిరుపమా (పూజా కుమార్‌), ఆస్మితా సుబ్రమణ్యం (ఆండ్రియా)లతో కలిసి ఛేదిస్తాడు. అదే సమయంలో తొలి భాగం చివర్లో విసామ్‌ నుంచి తప్పించుకున్న అల్‌ ఖైదా తీవ్రవాది ఒమర్‌ (రాహుల్‌ బోస్‌) ఢిల్లీలో 64 బాంబ్ బ్లాస్ట్‌లు ప్లాన్‌ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విసామ్‌, ఒమర్‌ ప్లాన్‌ను ఎలా అడ్డుకున్నాడు అన్నదే ‘విశ్వరూపం 2’ కథ.

నటీ నటుల పనితీరు :
యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది ? విసాం క్యారెక్టర్‌లో అదరగొట్టేసాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటుడిగా తన విశ్వరూపం చూపించాడు. ఆండ్రియా, పూజా కుమార్ ఇద్దరూ ముఖ్యమైన పాత్రల్లో కనిపించి సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యారు. రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ మిగతా నటీనటులందరూ వారి క్యారెక్టర్స్‌కి బెస్ట్ అనిపించారు.

టెక్నిషీయన్స్ పనితీరు :
టెక్నికల్‌ వ్యాల్యూస్ పరంగా 'విశ్వరూపం'కి ఏ మాత్రం తగ్గకుండా ఉంది ‘విశ్వరూపం2’. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్, సౌండ్ డిజైనింగ్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో పెట్టాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటింగ్ పరవాలేదు కానీ మొదటి భాగం కొంత భాగం ట్రిమ్ చేస్తే ఇంకొంత బాగుండేది. సందర్భానుసారంగా వచ్చే శశాంక్‌ వెన్నెలకంటి మాటలు ఆకట్టుకున్నాయి. కమల్ రచయితగా దర్శకుడిగా తన ఫుల్‌ఎఫర్ట్ పెట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్‌లో ఉన్నాయి.

'విశ్వరూపం' సినిమాతో హాలీవుడ్ స్టైల్ స్పై థ్రిల్లర్‌ను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసి మెస్మరైజ్ చేసిన కమల్ ఈసారి ‘విశ్వరూపం2’తో ఆ మేజిక్‌ను మళ్లీ రిపీట్ చేయలేకపోయాడు. పార్ట్ 1 వచ్చిన ఐదేళ్ళ తర్వాత ఈ సీక్వెల్ రావడం వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. కానీ విశ్వరూపం చూసి కమల్ ఈసారి కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మెస్మరైజ్ చేస్తాడనుకుంటే మాత్రం ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. చాలా సన్నివేశాలకు ‘విశ్వరూపం’తో లింక్‌ ఉండటంతో ఆ సినిమా చూసిన వారికే ‘విశ్వరూపం 2’ పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. పార్ట్ 1 మిస్ అయిన వారికి ఈ సినిమా అర్థం కావడం కష్టమే. నిజానికి పార్ట్ 1 వచ్చిన ఐదేళ్ళ తర్వాత ఈ సినిమా విడుదల కావడం మొదటి మైనస్ పాయింట్. 

నిజానికి కమల్ ఈ సీక్వెల్పై పెద్దగా ఫోకస్ పెట్టలేదేమో అనే సందేహం కూడా ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఈసారి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఇంప్రెస్ చేసిన కమల్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ముఖ్యంగా సినిమా అంతా స్లో నేరేషన్‌తో సాగడం, పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎడిటింగ్, సాదా సీదా క్లైమాక్స్ సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. ముఖ్యంగా మొదటి భాగంలో మిగిలిపోయిన ఎడిటెడ్ సీన్స్‌తో సినిమాను చుట్టేసాడేమో అనిపించింది. 

మొదటి భాగం నిడివి ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులకు ఇంటర్వెల్ ఎప్పుడొస్తుందా.. అనే ఫీలింగ్ కలిగింది. తీవ్రవాదం గురించి ఎంతో అధ్యయనం చేసి 'విశ్వరూపం'ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క‌మ‌ల్ ఈ సీక్వెల్‌పై మరింత శ్రద్ధ పెడితే కచ్చితంగా మంచి అవుట్‌పుట్ వచ్చి ఉండేది. సినిమాలో ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్స్, మినహా ఆస‌క్తిక‌రమైన అంశాలు కానీ.. సరైన క‌థ‌నం కానీ లేకపోవడంతో కేవలం ఓ ఆవరేజ్ సినిమా అన్న ఫీల్ కలిగిస్తుంది. తొలిభాగం చూసిన త‌ర్వాత ఈ సినిమా చూస్తే అంతగా నచ్చదు.. చూడ‌ని వాళ్లకు అసలు సినిమానే అర్థం కాదు. అంతిమంగా కమల్ ‘విశ్వరూపం 2’ జస్ట్ పరవాలేదు అనిపించే స్పై యాక్షన్ డ్రామా అనిపించుకుంది.

రేటింగ్ : 2 / 5

జీ సినిమాలు సౌజన్యంతో... 

Trending News