ఇటీవలి కాలంలో వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో గల కుంట గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ప్రత్యేక సాయుధ బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. మరికొంత మంది పారిపోయారని.. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనాస్థలి నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గొల్లపల్లి ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
Chhattisgarh: 14 naxals killed in an encounter with security forces near Sukma's Konta and Golapalli police station limits, 16 weapons recovered.
— ANI (@ANI) August 6, 2018
పెద్ద సంఖ్యలో మావోలు మృతి చెందటంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. ఘటనాస్థలికి మరిన్ని భద్రతా దళాలను ప్రభుత్వం తరలించింది. చనిపోయిన 14 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తిస్తున్నారు.