వర్కింగ్ ఉమెన్స్ ఈ మధ్య ఎక్కువైపోతున్నారు. ఇదివరకు ఒక్కరి జీతంతోనే ఇల్లు గడవడం జరుగుతుండేది. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. అందుకే ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరి వేతనాల్లో ఒకరి జీతంతో ఇల్లు గడుస్తుంటే, మరొకరి జీతంతో ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు.
ఇక్కడివరకు ఒకే.. మరి వంట సంగతి. ఉద్యోగాల్లో పడి వండుకోవడమే మర్చిపోతున్నారు. అదేదో పెద్ద భారం అయినట్లు.. వంట ఆంటే గంటలు గంటలు పని చేయాల్సి వస్తుందనే భావనతో ఈ అంశాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. బయట రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా.. వంట అంటే జంకుతున్నారు. ఉద్యోగాల కారణంగా దూర ప్రాంతాలలో, విదేశాల్లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్‌లో ఈ తరహా జాడ్యం ఎక్కువ. దగ్గర్లో సలహా, సూచనలు ఇవ్వడానికి తల్లితండ్రులు, అత్తమామలు కూడా ఉండరు.
ఈ నేపథ్యంలో కేవలం 15-25 నిమిషాల్లో వంట చేసుకొనే రెసిపీలు ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాం. ఉదయం లేదా సాయంత్రంవేళ ఈ రెసిపీలను ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా ఆదా అవుతుంది. అలాగే అవి తినడానికి రుచిగా కూడా ఉంటాయి.
* మీకు టైమ్ దొరికేది వీకెండ్లోనే కాబట్టి.. వీక్ డేస్‌లో ఏమేమి తయారుచేసుకోవాలో జాబితా తయారుచేసుకొని పెట్టుకోండి. సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఆ వస్తువులను తెచ్చుకోండి.
* ఇడ్లీ, దోశ లాంటివి చేసుకోవాలని అనుకుంటే పిండి సిద్ధం చేసుకొని ముందుగానే ఫ్రిజ్‌లో పెట్టుకోండి.
* పూరీ, చపాతీ వంటివి చేసుకోవాలనుకుంటే పిండి కలుపుకొని ఫ్రిజ్‌లో పెట్టండి. డై భాగాన్ని తొలగించండి. అలాగే ఆ పిండితో రోటీలు, పూరీలు చేసుకోండి. టైం ఇంకా ఆదా కావాలనుకుంటే రాత్రే చపాతీలు చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకొని ఉదయం మైక్రోవేవ్ ద్వారా వేడిచేసుకొని తినండి.
*బ్రెడ్ ప్యాకెట్ ఇంట్లో ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోండి. అలా అయితే.. శాండ్విచ్, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి తొందరగా చేసుకోవచ్చు.
* పచ్చళ్ళు, ఇడ్లీ పొడి, కరివేపాకు పొడి, ఎల్లుల్లి కారం, పెరుగు పచ్చడి, ఆకుకూరల పచ్చడి లాంటివి వీకెండ్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోండి. అవి ఇడ్లీ, చపాతీ, దోవ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా ఉపయోగపడతాయి.
* అలాగే మ్యాగీ, నూడుల్స్, ఓట్స్ లాంటి రెడిమేడ్ వస్తువులను ఎప్పుడూ వంటగదిలో ఉంచుకోవడం మంచిది. అవసరానికి తొందరగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎగ్ నూడుల్స్ చేసుకోవాలని అనిపిస్తే బాణలిలో గుడ్డు పగలగొట్టి అందులో నూడుల్స్ వేస్తే సరి.
* దక్షిణ భారతీయ వంటకాల్లో కొబ్బరి ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వీకెండ్లో కొబ్బరి తురుము, ముక్కలు చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోండి.
* ఉల్లిపాయ- టమాటా మసాలా ఉత్తర భారతీయ వంటకాల్లో వాడుతారు. కావున మీరు కూడా వాటిని మసాలా దట్టించి ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు టేబుల్ స్పూన్లతో తీసుకొని కూరలలో వేసుకోవచ్చు.
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటే వంటల్లో కూడా రుచి కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే దానిని సిద్ధం చేసుకొని ఉంచుకుంటే మేలు. అలానే ఉల్లిపాయ తొక్క తీసి కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవచ్చు. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనాలను కడిగి, ఆరబెట్టి సిద్ధం చేసుకోవాలి.
* నాన్ వెజ్ తయారుచేసుకొనే వారు గుడ్లు, చేపలు, చికెన్, మటన్‌లను సిద్ధం చేసుకోవాలి. వాటిలో ఏమేమి వేయాలో ముక్కలు చేసుకొని కాసింత సుగంధ ద్రవ్యాలను చేర్చుకొని వేరేగా ప్యాకెట్ల రూపంలో ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. అవసరమైనప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి ఉడికించుకోవడమో లేదా ఫ్రై చేసుకోవడమో చేయాలి.