గుజరాత్లోని సూరత్ ప్రాంతంలో ఓ భారీ వివాహ వేడుక జరిగింది. సాధారణంగా అంత గొప్ప వేడుక చూస్తే అందరూ ఏ పెద్దింటి పెళ్లో జరుగుతుందని అనుకుంటారు. అయితే అంత ఆర్భాటంగా జరిగే ఆ వివాహ కార్యక్రమంలో దాదాపు 251 అనాథ బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపడక మానరు. అంత మంచి పనికి శ్రీకారం చుట్టిన వ్యక్తి పేరే మహేష్ సవానీ.
వజ్రాల వ్యాపారం చేసే ఈ గుజరాతీ వ్యాపారి ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'నేను ఒక తండ్రిగా ఇంతమంది బాలికలను దత్తత తీసుకొని వారికి, వారికి నచ్చిన వ్యక్తులను ఇచ్చి వివాహం చేయడం ఆనందంగా ఉంది' అని గర్వంగా అన్నారు మహేష్. 2012 నుండి ఈ వివాహాలు చేస్తున్న మహేష్, కన్యాదానాన్ని మించిన దానం లేదని.. ఈ వివాహ మహోత్సవాన్ని ఒక పవిత్ర కార్యంగా చేయడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.
ఈ వివాహాలు చేయడం కోసం ఓ ట్రస్టునే స్థాపించారు మహేష్. ఆ ట్రస్టు ద్వారా కొత్తగా పెళ్లైన దంపతులకు సోఫాలు, మంచాలతో పాటు ఓ నెల సరకులు కూడా ఆయన ఉచితంగా అందిస్తున్నారు. ఒక కూతురికి తండ్రి అందించే సారె లాంటిదే ఈ కానుక అంటుంటారు ఆయన.