భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుడు భగ్గుమంటాయో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ మన దేశంలో డెబ్భై రూపాయలు. కానీ కొన్ని దేశాల్లో పెట్రోల్ రెండు రూపాయలు, ఆరు రూపాయలుగా ఉంది. నిజమండీ బాబోయ్! అక్కడ నీళ్ల కంటే పెట్రోల్ ధర చాలా తక్కువ. అంత చౌకగా దొరికే ఆ దేశాల గురించి తెలుసుకుందామా..!
భారతదేశంలో పెట్రోల్ రేట్లు ఎప్పుడూ నిలకడగా ఉండవు. అందుకు కారణం అంతర్జాతీయ ముడిచమురు ధరలు, రూపాయి ధర పతనం తదితర అంశాలు కావచ్చు. బ్రిటన్, యుఎస్, నెదర్లాండ్స్, స్వీడన్, టర్కీ లాంటి దేశాలైతే మనకంటే ఎక్కువ డబ్బులు పెట్టి మరీ పెట్రోల్, డీజిల్ కొనుక్కోవాలి.
వెనెజులా : వెనెజులా దేశంలో పెట్రోల్ మహా చౌక. ఇక్కడ లీటర్ పెట్రోల్ 0.031 డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు రూపాయలు
సౌదీ అరేబియా : సౌదీఅరేబియా పెట్రోల్ ఆధారిత దేశం. దేశ ఆదాయంలో పెట్రోల్ వాటా సగంపైనే. ఇక్కడ పెట్రోల్ ధర 0.096 డాలర్లు. మన కరెన్సీలో ఆరు రూపాయలు అని అర్థం.
లిబియా : లిబియా ప్రపంచంలో అతిపెద్ద పెట్రోఉత్పాదక దేశాలలో ఒకటి. ఇక్కడ పెట్రోల్ ధర ఏడు రూపాయలు.
తుర్కెమేనిస్తాన్ : ఈ దేశంలో 90% పైగా కాకురాం ఎడారి వ్యాపించి ఉంది. ఇక్కడ 120 లీటర్ల పెట్రోల్‌ను ఫ్రీగా వాడుకోవచ్చు. ఒకవేళ 120 లీటర్లు మించి వాడాల్సివస్తే తొమ్మిది రూపాయల నలభై పైసలు చెల్లించాలి.
బహ్రెయిన్: బహ్రెయిన్ ఒక చిన్న ద్వీప దేశం. పెట్రోలు ఎగుమతి ఉత్పత్తులు ఈ దేశ జీడీపీలో 11% ఆక్రమించాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర పది రూపాయల యాభై పైసలు.
కువైట్ : వైశాల్యపరంగా ప్రపంచములోని అతిచిన్న దేశాలలో కువైట్ ఒకటి. దేశ జీడీపీలో 50% వాటా పెట్రోలియందే. ఇక్కడ పెట్రోల్ 11 రూపాయలు.
ఖతర్: పెట్రోల్, సహజవాయువు ఆదాయం మీద ఖతార్ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నిరుద్యోగం చాలా తక్కువ (0. 01% -2013 గణాంకాల ప్రకారం). ఇక్కడ విదేశీ ఉద్యోగులు 94% వరకు ఉన్నారు. పెట్రోల్ ధర లీటర్ 11 రూపాయల 75 పైసలు.
ఈజిప్టు: పిరమిడ్ కట్టడాలకు పేరుగాంచిన ఈజిప్టులో చమురుధరలు మనకంటే చాలా తక్కువ. లీటర్ పెట్రోల్ ధర 15 రూపాయలు.
ఒమాన్ : ఒమన్ ఆర్థికవ్యవస్థ ప్రధానముగా పెట్రోల్ ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఒమన్ రోజుకు 7,00,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడ పెట్రోల్ ధర సుమారు 16 రూపాయలు.
అల్జీరియా: ఆఫ్రికా, అరబ్ దేశాల్లో అల్జీరియా అతిపెద్దది. ఉత్తర ఐరోపాకు ఇక్కడి నుండి భారీగా సహజవాయువులు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కూడా పెట్రోల్ ధర 16 రూపాయలుగా ఉంది.
గమనిక : పెట్రోల్ ధర అంతర్జాతీయంగా వివిధ అంశాలపై ముడిపడి ఉంటుంది. కావున ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.