ఇంట్లోనే పానీ పూరీ చేసుకోండిలా..

Last Updated : Oct 30, 2017, 03:50 PM IST
ఇంట్లోనే పానీ పూరీ చేసుకోండిలా..

పానీ పూరీ స్నాక్స్ మాదిరి అందరికీ అలవాటైపోయింది. సాయంత్రం అయ్యిందటే రోడ్ల పక్కన పానీ పూరీ తోపుడు బండ్లు కనిపిస్తాయి. ఆ సమయంలో పిల్లలు, పెద్దలు 'పానీ' రుచి చూడాల్సిందే.. ! పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అమ్మా! పానీ పూరీ ఏదీ? అనేంతగా ఇది అలవాటైపోయింది. లేదు.. అంటే వినరు. బయట అపరిశుభ్రంగా కనిపించే తోపుడు బండ్ల వద్ద కొనడానికి ససేమీరా ఒప్పుకోరు పెద్దలు. కనుక ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా, రుచిగా ఉంటుంది. పానీ పూరీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!  

పూరీ కోసం కావలసిన పదార్థాలు-1

గోధుమ రవ్వ - 1 కప్పు 
మైదా - 3 టేబుల్ స్పూన్లు 
బేకింగ్ సోడా - 1/4 టేబుల్ స్పూన్ 
ఉప్పు - తగినంత 
వంట నూనె - వేయించేందుకు సరిపడా 
 

పానీ కోసం కావలసిన పదార్థాలు-2   

చింతపండు గుజ్జు - 1/2 కప్పు 
జీలకర్ర పొడి -  2 టేబుల్ స్పూన్లు 
నీరు- 2 కప్పులు 
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర ఆకులు- అరా కప్పు (మినహాయింపు)
పచ్చి మిరపకాయలు - మూడు 
పుదీనా ఆకులు - 1 కప్పు (మినహాయింపు)
 నల్ల ఉప్పు - 1 టేబుల్ స్పూన్ 

పూరీలో పెట్టే స్టఫ్ కోసం కావలసిన పదార్థాలు-3

బంగాళాదుంపలు - 2
పచ్చిమిరపకాయలు - మూడు 
ఉల్లిపాయలు  - 2 పెద్దవి (కట్  చేసుకోవాలి) 
జీలకర్రపొడి - 1 టేబుల్ స్పూన్ (వేయించినవి) 
ఉప్పు - తగినంత 
కొత్తిమీర- సరిపడా 

పూరీ తయారీ విధానం-1

 ఒక పాత్ర తీసుకొని అందులో  గోధుమరవ్వ, మైదా, ఉప్పు, బేకింగ్ సోడా, వేడి నీరు పోసి బాగా పూరీ పిండిలా కలుపుకొని,  30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ  తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరీలాగా ఒత్తి, కాగుతున్న నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేట్లు వేయించుకోవాలి. 

పానీ తయారీ విధానం-2

కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరప కాయలు, నల్ల ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలపాలి. ఆ నీళ్లలోనే  చింతపండు గుజ్జు, జీలకర్ర కూడా కలుపుకోవాలి. రుచి చూసుకుంటూ కాస్త ఎక్కువ, తక్కువ వేసుకోవాలి. 

పూరీలో పెట్టే స్టఫ్ తయారీ విధానం-3

బంగాళాదుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.  చల్లారాక వీటిని గుజ్జుగా చేసి పొయ్యి మీద పెనం పెట్టి నూనె వేసి తరిగిన పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఆతరువాత వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, వేసి గరిటెతో తిప్పుతూ వేడెక్కాక దించేయాలి.  అంతే స్టఫ్ రెడీ.  ఈ స్టఫ్ ను పూరీలో ఉంచి పానీలో ముంచి తింటుంటే ఆ మజానే వేరు..! 

Trending News