క్రైస్తవుల నమ్మకం ప్రకారం యేసుక్రీస్తు జయంతి సందర్భంగా జరుపుకునే పండుగ పేరే 'క్రిస్మస్'. యేసు జననం సంభవించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలైనా ఆయన బోధనలను అనుసరిస్తూ.. శాంతి ప్రబోధాలను గానం చేస్తూ.. నిత్యం యేసు నామస్మరణలో గడుపుతుంటారు క్రైస్తవ భక్తజనులు. పూర్వం ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి రోమా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో నజరేతు అనే పట్టణంలో మేరీ, జోసఫ్ దంపతులకు పుట్టిన శిశువే 'యేసు'. అయితే శిశువు మేరీ కన్యగా ఉన్నప్పుడే జన్మించాడని, ఒక దేవదూత ఆమె స్వప్నంలో కనిపించి.. అది దైవానుగ్రహమని తెలిపాడని ఓ కథ ప్రచారంలో ఉంది.
బెత్లెహాము ప్రాంతంలో ఎటువంటి కనీస వసతులు లేని పరిస్థితిలో మేరీ, యేసుకు ఒక పశువులపాకలో జన్మనిచ్చిందని అంటారు. కొందరు ప్రవక్తలతో పాటు గొర్రెల కాపరులు కూడా యేసు జన్మించిన చోటుకి వెళ్లి, దేవదూతను చూశారని.. ఆ పుట్టిన బాలుడు లోకరక్షకుడని చెప్పిన దేవదూత మాటలను విన్నారని కూడా కొన్ని క్రైస్తవ గ్రంథాలు చెబుతుంటాయి.
యేసుక్రీస్తు జన్మించినప్పుడు అంబరాన ఓ తార ప్రత్యక్షమైందని... ఆ తారను అనుసరిస్తూ వెళ్లిన ముగ్గురు ప్రవక్తలు బాలయేసు జన్మించిన స్థలానికి వెళ్లి ఆయనను దర్శించుకున్నారని అంటారు. వారు తమ ఆనందానికి గుర్తుగా శిశువుకు మూడు కానుకలు అందించారట. అవే బంగారు కడియం, బోళము మరియు సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారు కడియం బాలుడి పవిత్రతకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. అలాగే బోళం సమర్పణకు సూచన. అలాగే సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా చెప్పుకోవచ్చు.
లోక రక్షకుడిగా ఆ ప్రవక్తలకు కనిపించిన ఆ బాలుడే పెద్దయ్యాక యేసు పేరుతో ఒక ప్రబోధకుడిగా మారి ప్రజలకు ఎన్నో ఉపదేశాలు చేశాడు. మానవులు అహంకారులైతే అవమానం తప్పదని, వినయ విధేయతలతో ఉంటేనే జ్ఞానవంతులవుతారని చెబుతాయి యేసు బోధనలు.
'ఏ పశువుల కాపరైనా తనకున్న వంద గొర్రెల్లో ఒకటి తప్పిపోతే.. ఉన్న తొంభై తొమ్మిదింటినీ వదిలి, తప్పిపోయిన ఆ ఒక్కదాన్నీ వెదకడానికి వెళతాడు. ఎంత అలసిపోయినా.. తను ఆ గొర్రె కోసమే వెదుకుతాడు. అది దొరికినప్పుడు అతని ఆనందం వర్ణనాతీతం. అలా తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా యేసును ఆయన భక్తులు కొలుస్తారు.
యేసు బోధనల్లో కొన్ని:
నిన్ను వలే నీ పొరుగువాణ్ని ప్రేమించు
దుర్మార్గులను, సన్మార్గులను; పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్య మానసాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి
సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవస్వరూపుడిగా మారుస్తుంది
దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే... దానికి మార్గం- ప్రేమతత్వం, కరుణ, క్షమ