Who is Sukhvinder Singh Sukhu: సుఖ్విందర్ సింగ్ సుఖు.. ఈయన ఎవరో కాదు.. హిమాచల్ ప్రదేశ్ కి కాబోయే కొత్త ముఖ్యమంత్రి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ అయిన సుఖ్విందర్ సింగ్ సుఖుని ముఖ్యమంత్రి పదవి వరించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు కీలక నేతలను కాదని సుఖ్విందర్ సింగ్ ని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వరించింది. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి లాంటి కీలక నేతలను పక్కకుపెడుతూ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సుఖ్విందర్ సింగ్‌కే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆ అవకాశం ఇచ్చింది.
సుఖ్విందర్ సింగ్‌కే భారీ మద్దతు
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్విందర్ సింగ్‌కి కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది మద్దతు ఉందని తెలుస్తోంది. సుఖ్విందర్ సింగ్‌కి ఉన్న ఈ బలం మిగతా నేతలకు లేకపోవడమే ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయనకు కలిసొచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే ఎక్కువ మద్దతు లేని నేతలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చినా.. వారు ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సుఖ్విందర్ సింగ్ సుఖు వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
మీడియాతో సుఖ్విందర్ సింగ్ సుఖు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనన్నారు. ఈ సందర్భంగా సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనదేనన్న సుఖ్విందర్ సింగ్.. తమ ప్రభుత్వం మార్పును తీసుకొస్తుంది అని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయనున్నట్టు సుఖు స్పష్టంచేశారు.
డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రి..
ఇంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన ముఖేష్ అగ్నిహోత్రి కొత్త కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖేష్ అగ్నిహోత్రితో కలిసి తామంతా ఒక బృందంగా ఐక్యమత్యంతో పనిచేస్తాం అని సుఖ్విందర్ సింగ్ స్పష్టంచేశారు. 17 ఏళ్ల వయస్సులోనే తాను రాజకీయ ఆరంగేట్రం చేశానని.. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో చేసిందని అన్నారు.
సుఖ్విందర్ సింగ్ సుఖు రాజకీయ ప్రస్థానం..
నడావ్ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థి విజయ్ కుమార్‌పై 3,300 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు.. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2003 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సుఖు.. 2007 లో ఓటమిపాలయ్యారు. తరువాత 2012, 2017, 2022 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2013 నుంచి 2019 వరకు రాష్ట్ర పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు. 1998 నుంచి 2008 వరకు పదేళ్ల పాటు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగాను ఉన్నారు. విద్యార్హతల పరంగా న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన సుఖ్విందర్ సింగ్.. రెండు పర్యాయాలు షిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా వ్యవహరించారు. 2008 లో పీసీసీ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టిన సుఖ్విందర్ సింగ్ తాజాగా 58 ఏళ్ల వయస్సులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు.
ఇది కూడా చదవండి : Himachal Pradesh CM: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు.. రేసులో ఉన్నది వీళ్లే..!
ఇది కూడా చదవండి : AAP as National Party: ఆప్‌కు అరుదైన గుర్తింపు, ఇక ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీ
ఇది కూడా చదవండి : Himachal pradesh Results: హిమాచల్‌లో కొనసాగిన సాంప్రదాయం, అధికారం కాంగ్రెస్ పరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook