పశ్చిమ బంగ పేరు మారబోతుంది.. ఇక నుండి "బంగ్లా"

పశ్చిమ బంగ పేరును మార్చడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టగా.. ఈ రోజు అసెంబ్లీ ఆమోదించింది

Last Updated : Jul 26, 2018, 09:42 PM IST
పశ్చిమ బంగ పేరు మారబోతుంది.. ఇక నుండి "బంగ్లా"

పశ్చిమ బంగ పేరును మార్చడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టగా.. ఈ రోజు అసెంబ్లీ ఆమోదించింది. రెండు సంవత్సరాల నుండి ఈ బిల్లు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలే ఆమోదం లభించింది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే ఇక పశ్చిమ బంగ పేరు "బంగ్లా"గా మారిపోనుంది. 2016 ఆగస్టు 29వ తేదిన పశ్చిమ బంగకు సంబంధించి ఆ పదాన్ని మూడు భాషల్లో మూడు విధాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంగ్లంలో "బెంగాల్" అని.. బెంగాలీలో "బంగ్లా" అని... హిందీలో "బంగాల్" అని మార్చాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా ఇంగ్లీష్ భాషలో వెలువడే రాష్ట్రాల జాబితాలో ఎప్పుడూ "వెస్ట్ బెంగాల్" అనే పదం చివరన ఉండడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. ఇక నుండి ఇంగ్లీష్ భాషలో వెలువడే జాబితాలో "బెంగాల్" నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక, బెంగాల్ ప్రావిన్సు రెండుగా విడిపోయింది. అందులో ఈస్ట్ బెంగాల్ పాకిస్తానులో.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో విలీనం కాగా.. వెస్ట్ బెంగాల్ భారత భూభాగంలోకి వచ్చింది. 

అయితే ఈ పేరు మార్చే విధానానికి ఆరెస్సెస్‌ తన వ్యతిరేకతను చూపిస్తోంది. పేరు మార్చడం ద్వారా ఈస్ట్ బెంగాల్ అనేది ఒకటుంది అనే విషయం మరుగునపడిపోయే అవకాశం ఉందని.. దాని గురించి కొందరికి తెలిసే అవకాశం తగ్గుతుందని ఆరెస్సెస్‌ వాదిస్తోంది. అయితే ‘బంగ్లా’ పేరుకు చారిత్రక నేపథ్యం ఉందని.. అదే ఆ రాష్ట్రానికి సరైన పేరని మమత బెనర్జీ అభిప్రాయపడుతున్నారు. 

Trending News