వీడియోకాన్ లోన్ కేసు: ఐసీఐసీఐ 'సీఈవో' పదవికి చందాకొచ్చర్ రాజీనామా?

వీడియోకాన్ గ్రూపుకు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేయడంతో ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందాకొచ్చార్ రాజీనామా చేయాలని కొంతమంది బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Apr 9, 2018, 06:35 PM IST
వీడియోకాన్ లోన్ కేసు: ఐసీఐసీఐ 'సీఈవో' పదవికి చందాకొచ్చర్ రాజీనామా?

వీడియోకాన్ గ్రూపుకు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేయడంతో ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందాకొచ్చార్ రాజీనామా చేయాలని కొంతమంది బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. చందాకొచ్చర్‌కు అండంగా నిలుస్తున్నారు. ఇలా బ్యాంకు బోర్డు సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు  సంబంధిత వర్గాలు చెప్పాయి. చందాకొచ్చర్ పై వ్యతిరేకత వస్తున్న  నేపథ్యంలో..  ఐసీఐసీఐ బోర్డు సభ్యుల సమావేశం ఈ వారంలోనే జరుగుతుందన్నట్లుగా పేర్కొన్నాయి.

 

ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా  చందాకొచ్చర్ పదవి కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బోర్డులో మొత్తం 12 మంది సభ్యులున్నారు. చైర్మన్‌ ఎంకే శర్మ ఆధ్వర్యంలో ఈ బోర్డు నడుస్తోంది. 12 మంది సభ్యులలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒకరు ప్రభుత్వ నామినీ, ఐదుగురు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లున్నారు.

క్విడ్‌ ప్రో కో ప్రతిపాదికన వీడియోకాన్‌ గ్రూపుకు చందాకొచ్చర్ లోన్ మంజూరు చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంపై బోర్డు సమాధానం కూడా ఇచ్చింది. రుణాల జారీలో ఎలాంటి క్విడ్‌ ప్రో కో లేదని, సీఈఓపై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని బోర్డు తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చందాకొచ్చర్ కుటుంబసభ్యులు ఉన్నట్లు ఆధారాలు బహిర్గతం కావడంతో ఆమె చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. దీంతో సీఈవోగా చందాకొచ్చర్  కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.  ఇప్పటికే ఈ విషయంపై కొచ్చర్ భర్త దీపక్‌ కొచ్చర్ పై, వీడియోకాన్‌ ఛైర్మన్ వేణుగోపాల్‌ ధూత్‌పై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా ప్రారంభించిందని సమాచారం.

ఇదిలా ఉండగా..  చందా కొచ్చర్ రాజీనామా చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్త వెలువడగానే ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నట్లు సమాచారం. కాగా చందాకొచ్చర్ రాజీనామా వార్తలు ఆవాస్తవమంటూ ఐసీఐసీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఒకవేళ సీఈవోగా చందాకొచ్చర్ రాజీనామా చేస్తే, షేర్లు పతనమవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Trending News