జాతీయ గణాంక దినం (జూన్ 29), పీసీ మహలనోబిస్ 125వ జయంతి సందర్భంగా కొత్త రూ.125 స్మారక నాణెంను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం విడుదల చేయనున్నారు. గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్ జయంతినే కేంద్రం, గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జూన్ 29ను గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని కేంద్రం 2007లో నిర్ణయించింది. పీసీ మహాలనోబిస్ 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ఐఎస్‌ఐ)ను ఏర్పాటు చేశారు.
జూన్ 29న గణాంకాల దినోత్సవాన్ని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ఐఎస్‌ఐ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ ఏడాది గణాంకాల దినోత్సవ థీమ్ ‘అధికారిక గణాంకాల్లో నాణ్యతా హామీ’. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉపరాష్ట్రపతి వెంకయ్య.. రూ.5 నాణేలను కూడా విడుదల చేయనున్నారు. సాంఘీక, ఆర్థిక ప్రణాళికలు, విధానాల రూపకల్పనలో గణాంకాల ఆవశ్యకత, మహాలనోబిస్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేయడమే ఈ నాణేల విడుదల ఉద్దేశం.