సీనియర్ కాంగ్రెస్ నేత రాజేంద్ర కుమార్ ధావన్ ఈ రోజు దేశ రాజధానిలో కన్నుమూశారు. 81 ఏళ్ల ధావన్ గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ధావన్ పర్సనల్ అసిస్టెంటుగా పనిచేశారు. 1962 నుండి 1984 వరకు, అనగా ఇందిర మరణించేవరకు ఆమెకు పీఏగా ధావన్ వ్యవహరించారు. 1975, 1977 సంవత్సరాల్లో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ప్రధాని ఇందిర ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన జట్టులో ధావన్ పనిచేశారు. ఆ సమయంలో అంబికా సోనీ, కమలనాథ్ లాంటివారితో కలిసి ధావన్ కూడా పనిచేశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీతో పాటు పంజాబ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేటైన ధావన్ చాలా కాలం బ్యాచిలర్‌గా ఉన్నారు.
తన 74 ఏళ్ళ వయసులో 60 సంవత్సరాల అచ్లా అనే ఆమెను ఆయన వివాహం చేసుకున్నారు. అచ్లా అప్పటికే వివాహమైన తన భర్తతో విడాకులు కూడా తీసుకున్నారు. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. 2012లో అచ్లాతో ధావన్ వివాహం జరిగింది.ఇందిరాగాంధీకి పర్సనల్ అసిస్టెంటుగా వ్యవహరించిన ధావన్ పై కూడా ఆమె చనిపోయిన తర్వాత పలు ఆరోపణలు వచ్చాయి.
ఇందిరాగాంధీ మరణం పై జరిగిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా అధికారులు ధావన్‌ని అనేకసార్లు ప్రశ్నించారు. ఆమెపై దుండగులు కాల్పులు జరుపుతున్న సమయంలో.. ధావన్ ఆమెకు కొద్ది దూరంలోనే ఉండడంతో ఆ కేసులో ఆయన సాక్ష్యం కూడా ఎంతో కీలకంగా మారిపోయింది. ఆ తర్వాత ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వివాదాల నుండి ఆయన వేగంగానే బయటపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధావన్ గత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన బీఎల్ కాపూర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.