ఫతేపూర్: రాజస్తాన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని భావిస్తున్న క్రమంలోనే ఫతేపూర్‌లో ఓ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. శిఖర్‌లోని సుభాష్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద రెండు సమూహాల మధ్య ఏర్పడిన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. కాసేపట్లోనే ఆ ఘర్షణ కాస్తా హింసగా మారింది. ఇరు గ్రూపులు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే క్రమంలో అక్కడే వున్న పలు వాహనాలకు నిప్పంటించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది వినియోగించిన వాహనం అద్దాలు సైతం ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో అక్కడ 30 నిమిషాలసేపు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.
పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టాయి. అల్లరి మూకలను పోలింగ్ బూత్ నుంచి తరిమికొట్టిన అనంతరం ఓటింగ్ యధావిధిగా తిరిగి ప్రారంభమైందని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
రాజస్తాన్ ఎన్నికలు: వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు!