Vande Bharath Train Launch In telugu States Preponed : తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందజేయనుంది. అదేమంటే జనవరి 15న సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. నిజానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 19న ఈ ప్రారంభోత్సవం జరగాల్సినప్పటికీ పండగ సమయంలో తెలుగు ప్రజలకు కానుక ఇచ్చేందుకు నాలుగు రోజులు ముందే ఈ రైలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే జనవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. అయితే అదే సమయంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొన నున్నారు.
దేశంలో కేంద్రం ప్రవేశ పెట్టిన 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా కేవలం 8 గంటల్లో విశాఖపట్నం చేరుకోనుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రయిల్ రన్ కోసం విశాఖ తీసుకువెళ్లిన ఈ రైలు మీద ఆకతాయిలు కంచరపాలెం దగ్గరలో రైలు మీద ఎటాక్ చేయడంతో కొన్ని భోగీలు దెబ్బ తిన్నాయి. వాటిని ఇప్పుడు సరిచేసి 15వ తేదీకి సిద్ధం చేసే అవకాశం ఉంది.
ప్రత్యేకతలు
ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్‌లు అత్యాధునికంగా డిజైన్ చేశారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా బోగీలను సిద్ధం చేశారు. ఇక ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కు ఏర్పాటు చేశారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో మొత్తం 16 కోచ్‌లు ఆ 16 కోచ్ లకు గాను 1128 సీట్లు ఉంటాయి. ఇతర రైళ్లతో పోలిస్తే ధర కొంచెం ఎక్కువే అయినా చాలా సమయం ఆదా అవుతుందని చెప్పచ్చు.
అంతేకాదు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో వైఫై, హాట్‌స్పాట్ సౌకర్యం కూడా ఉంటుందని అంటే నమ్మక తప్పదు. క జీపీఎస్ ఆధారిత ఆడియో విజ్యువల్ ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో అందుబాటులో ఉంటుంది. బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్ కూడా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం సిద్ధం చేశారు, అలాగే ప్రతి కోచ్‌కు ప్యాంట్రీ సౌకర్యం కల్పించనున్నారు.