వారిని తాగుబోతులు అన్నందుకు మంత్రిపై దాడి

యూపీ వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి ఓం ప్రకాష్ రాజ్బర్ చేసిన వ్యాఖ్యలు పలువురికి ఆగ్రహం తెప్పించాయి. 

Last Updated : Apr 29, 2018, 07:55 AM IST
వారిని తాగుబోతులు అన్నందుకు మంత్రిపై దాడి

యూపీ వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి ఓం ప్రకాష్ రాజ్బర్ చేసిన వ్యాఖ్యలు పలువురికి ఆగ్రహం తెప్పించాయి. వారణాశిలో మద్యపాన నిషేధం పై నిర్వహించిన సదస్సులో  రాజ్బర్ మాట్లాడుతూ  యాదవులు, రాజ్‌పుత్‌లు ఎక్కువగా మద్యం సేవించేవారి జాబితాలో ముందుంటారని.. మద్యం తాగడం, విక్రయించడం అనేది వారికి పూర్వీకుల నుండి వచ్చిన సంప్రదాయమని అన్నారు.

ఆయన చేసిన అవే వ్యాఖ్యలు ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ కులాలకు చెందిన అనేక సంఘాలు మంత్రి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండించాయి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఆయన అలాంటి మాటలు ఎలా ఆడతారని తెలిపాయి. అవే వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ "మద్యం సేవించేది జనాలు మాత్రమే.. కులాలు కాదు" అన్నారు

ఎప్పుడైతే రాజ్బర్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపాయో.. అనేక యాదవ సంఘాలు మంత్రి ఇంటి వద్దకు వచ్చి అక్కడ బైఠాయించాయి. ఆ తర్వాత ఆయన ఇంటిపై కుళ్లిన కోడిగ్రుడ్లను, టమోటాలను సంఘాల వాలంటీర్లు విసిరారు. రాజ్బర్ మాట్లాడుతూ "రాజ్బర్లు కూడా తాగుతారు. కాదనను. అలాగే చౌహాన్లు, లోహర్లు, కుమార్లు కూడా తాగుతారు.

ఈ తాగుబోతులు ఇంటికి వెళ్లి ఎలా ప్రవర్తిస్తారో వారి భార్యలను, తల్లులను, బిడ్డలను అడగండి. వారు ఎంత బాధపడుతున్నారో అడగండి. నేను గత 15 సంవత్సరాలుగా యూపీలో మద్యం నిషేధించమని అడుగుతున్నాను. అలా చేసే ప్రభుత్వానికి మహిళలు బ్రహ్మరథం పడతారు" అని అన్నారు. అలా అన్నాక యాదవులు, రాజపుత్‌లు ఎక్కువగా మద్యం తాగుతారని అభిప్రాయపడ్డారు మంత్రి. ఆ అభిప్రాయంతో చేసిన వ్యాఖ్యలే పెనుదుమారం రేపాయి

Trending News