ప్రధాని ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకుంటున్న తెదేపా ఎంపీలు

లోక్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ప్రారంభించిన తరువాత కూడా తెలుగుదేశం ఎంపీల ఆందోళన ఆగలేదు.

Last Updated : Feb 8, 2018, 10:42 AM IST
ప్రధాని ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకుంటున్న తెదేపా ఎంపీలు

లోక్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ప్రారంభించిన తరువాత కూడా తెలుగుదేశం ఎంపీల ఆందోళన ఆగలేదు. ప్రధాని ప్రసంగం సమయంలో ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రుల వినతిని తెలుగుదేశం ఎంపీలు ఖాతరు చేయలేదు. ఇలా ఉండగా తెలుగుదేశం ఎంపీల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతుగా నిలవడం విశేషం. ఒక దశలో స్పీకర్ తీరును కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ తాను మాట్లాడుతుండగా సభ కంట్రోల్‌లో లేదని, తనను మాట్లడకుండా అడ్డుకోవాలనుకుంటున్నారా అని స్పీకర్‌ను ప్రశ్నించారు.

స్పీకర్ చురకలు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తెలుగుదేశం ఎంపీలు అడుగడుగునా అడ్డుకోసాగారు. సంయమనం పాటించాలని స్పీకర్ పదే పదే చేస్తున్న విజ్ఞప్తులను వారు ఖాతరు చేయలేదు.  మోదీ ప్రసంగం ప్రారంభించిన వెంటనే తెలుగుదేశం నిరసనలు మరింత పెరిగాయి. సభలో ప్రసంగిస్తున్న సభ్యుల ముఖాలకు అడ్డుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారి ప్రసంగాలను అడ్డుకోసాగారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా వారు తమ ఆందోళనను విరమించలేదు. సభలో ఇలా ప్రవర్తించిన మీరు మీ ఇండ్లలో పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పుతారంటూ స్పీకర్ మందలించారు.

రాజ్‌నాథ్ సింగ్ ఫోన్

లోక్‌సభలో సభ్యుల ఆందోళనను విరమింపచేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌లో చంద్రబాబును కోరారు. అయితే ఆందోళన విరమణపై ఎటువంటి హామీ ఇవ్వని చంద్రబాబు తెలుపుతూ.. ఇలాగే వేచి చూసే ధోరణలో ప్రభుత్వం కాలం గడిపితే  కుదరదని, ప్రజలు అంగీకరించరని రాజ్ నాథ్‌కు స్పష్టం చేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

Trending News