విలేకరికి క్షమాపణ చెప్పిన తమిళనాడు గవర్నర్

మహిళా విలేకరి పట్ల తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.

Last Updated : Apr 18, 2018, 02:53 PM IST
విలేకరికి క్షమాపణ చెప్పిన తమిళనాడు గవర్నర్

మహిళా విలేకరి పట్ల తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా విలేకరి ఇబ్బందికి గురికావడం వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని, తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని  ఓ ప్రకటనలో తెలిపారు.

గవర్నర్ బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ ఆరోపించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ప్రొఫెసర్‌ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్‌ పేర్కొన్నారు. సమావేశం ముగిసి వెళ్ళిపోతున్న సమయంలో ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా ఆమె చెంపను తాకారు. గవర్నర్‌ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన పట్ల గవర్నర్‌ ప్రవర్తించిన తీరుపై  ఆ మహిళా విలేకరి ట్విటర్‌లో స్పందించారు.

అంతకు ముందు ఆ మహిళా విలేకరి ట్విట్టర్‌లో ‘విలేకరుల సమావేశంలో తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సంఘటనపై విపక్ష డీఎంకే నిప్పులు చెరిగింది. గవర్నర్ చర్యను ఖండించింది. ఉద్దేశం ఏదైనా కావచ్చని, ఓ యువతి/మహిళ గౌరవానికి భంగం కలిగించడం మాత్రం సభ్యత అనిపించుకోదని ఎంపీ కనిమొళి ట్వీట్‌ చేశారు.

 

Trending News