మన రైల్వే వ్యవస్థ పనితీరు ఎంతగొప్పగా ఉందో ఈ ఘటన తెలిస్తే అర్థమవుతుంది. మహారాష్ట్రకు వెళ్ళాల్సిన ఒక రైలు దారి తప్పి మధ్యప్రదేశ్ కు వెళ్ళింది. వివరాల్లోకి వెళితే.. మొన్న ఢిల్లీకి మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు వెళ్లారు. అక్కడ జరిగే రైతు మహా ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా ముగిసిన తరువాత సొంత రాష్ట్రానికి బయలుదేరటానికి ఢిల్లీలో స్వాభిమాని ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. తీరా ఆ రైలు సొంత ఊరికి చేరకుండా మధ్య ప్రదేశ్ లోని బర్మోర్ స్టేషన్ కు వెళ్ళింది. సిగ్నలింగ్ పొరపాటు కారణంగా 160 కిలోమీటర్లు తప్పు దారిలో ప్రయాణించాం అని గుర్తించిన రైలు సిబ్బంది నాలుక్కర్చుకుంది. గంటల తరబడి తెలియని ప్రదేశంలో చిక్కుకొని ఇబ్బంది పడ్డ తమను రైలు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులు స్వరాష్ట్రానికి వెళ్ళడానికి రైలు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.