ఢిల్లీలో 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లను స్వయంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పర్యవేక్షించారని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల పరిస్థితిని అంచనా వేయడానికి రాజీవ్ గాంధీ తనతో ఉత్తర ఢిల్లీ అంతటా కలిసి తిరిగారని సీనియర్ కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బాదల్ ప్రస్తావించారు.
"జగదీష్ టైట్లర్ వెల్లడించిన ప్రకారం చూస్తుంటే.. 1984లో రాజీవ్ గాంధీ నగరం అంతటా తిరిగినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి చూస్తే ప్రధాని అల్లర్లను పర్యవేక్షించారని అర్థమవుతోంది. సిబీఐ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి" అని బాదల్ చెప్పారు. 1984 అక్టోబర్ నెల 31వ తేదీన ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపిన అనంతరం ఉత్తర భారతదేశం అట్టుడికింది. యుపీ,ఢిల్లీ,హర్యానా,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలకు అల్లర్లు వ్యాపించాయి. ఈ హింసాకాండలో 3325 మంది మరణించగా.. ఢిల్లీలోనే 2,733 మంది చనిపోయారు.