భారతదేశంలోనే అత్యధికకాలం సీఎంగా రికార్డు

భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? అనే ప్రశ్నకు ఠక్కున గుర్తొచ్చే సమాధానం జ్యోతిబసు.

Last Updated : Apr 28, 2018, 08:15 PM IST
భారతదేశంలోనే అత్యధికకాలం సీఎంగా రికార్డు

భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? అనే ప్రశ్నకు ఠక్కున గుర్తొచ్చే సమాధానం జ్యోతిబసు. అయితే రేపొచ్చే ఆదివారం నుండీ ఈ సమాధానం మారిపోతుంది. ఇప్పడు ఈ ప్రశ్నకు సమాధానం పవన్ కుమార్ చామ్లింగ్ అని చెప్పుకోవచ్చు. 1977 జూన్ 21న ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన జ్యోతిబసు 8840 రోజులు అంటే 23 ఏళ్ల 4 నెలల 17 రోజుల పాటు- 2000 సంవత్సరం నవంబరు 5 వరకు పనిచేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్ట్ (సీపీఎం)కు చెందిన ఆయన వరుసగా 5 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. అయిదో విడత పదవీ కాలం ముగియడానికి ముందే ముఖ్యమంత్రి స్థానం నుంచి వైదొలిగారు.

పవన్ కుమార్ కూడా సిక్కిం ముఖ్యమంత్రిగా నేటితో 8, 840 రోజుల కాలం పూర్తి చేసుకోనున్నారు. పవన్ కుమార్ చామ్లింగ్ కూడా ప్రస్తుతం అయిదోసారి ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. 1994 డిసెంబర్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్.. 1999, 2004, 2009, 2014లోనూ గెలిచారు. ఈయన సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) కు నాయకత్వం వహిస్తున్నారు.

సీఎం కావడానికి ముందు సిక్కిం సంగ్రామ పరిషత్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చామ్లింగ్ ఆ తరువాత 1993లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌ను స్థాపించారు. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో తన పార్టీ అత్యధిక సీట్లు సాధించడంతో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో మొత్తం 32 అసెంబ్లీ సీట్లనూ చామ్లింగ్ పార్టీయే గెలుచుకొని రికార్డు సృష్టించింది.  2014 శాసనసభ ఎన్నికల్లో, శాంతి, భద్రత, అభివృద్ధి హామీలతో ఐదవసారి ఎన్నికల్లో గెలిచిన ఎస్‌డీఎఫ్ మొత్తం 32 సీట్లలో 22 సీట్లను గెలుచుకుంది. రంగాంగ్-యంగాంగ్ మరియు నామ్చి-సిన్హింథింగ్ శాసనసభ నియోజకవర్గాల నుండి భారీ మెజార్టీతో పవన్ చామ్లింగ్ ఎన్నికలలో విజయం సాధించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా పదవిలో ఉన్నవారిలో మిజోరాం సీఎం లాల్ తన్హావాలా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు.. పవన్ కుమార్ చామ్లింగ్ తరువాత స్థానాల్లో ఉన్నారు. ఏప్రిల్ 28, 2018 నాటికి నవీన్ పట్నాయక్ 6,628 రోజుల పాలన పూర్తిచేసుకుంటే.. లాల్ తన్హావాలా ఏప్రిల్ 28 నాటికి 7,824 రోజులు పాలన పూర్తి చేసుకుంటారు.

Trending News