మే 12న ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అధికారులు ఎంత నిఘా పెట్టినా ధన ప్రవాహం ఆగడం లేదు. కాంగ్రెస్‌తో సహా ప్రధాన పోటీదారులైన బీజేపీ, జేడీఎస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీకి తెరతీశారు. ఒక్కో పార్టీ వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయట. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రూ.5 వేల కోట్ల చొప్పున వెచ్చిస్తున్నాయట. ఇక జేడీఎస్ పార్టీ అయితే మూడు వేల కోట్ల రూపాయలను ప్రజలపై వెదజల్లుతోందట. రెండు ప్రధాన పార్టీలు ఒక్కో నియోజకవర్గానికి రూ.20వేల కోట్లను సగటున వెచ్చిస్తుండగా...రూ.100కోట్లు పెట్టాల్సిన ప్రాంతాలూ ఉన్నాయట.
ఇప్పటి వరకు రూ.158.83 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..!
మరికొన్ని రోజుల్లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పట్నుంచే ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.158.83 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో రూ.72.48 కోట్ల నగదు, రూ.23 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నట్టు ఎక్సైజ్, ఐటీ అధికారులు తెలిపారు. అలాగే, రూ.42 కోట్ల విలువైన బంగారం, వెండి, 20 కోట్ల విలువైన చీరలు, కుక్కర్లు, గుట్కాలు, ల్యాప్ టాప్‌లు, వాహనాలు మొదలైనవి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.