శబరిమలలో భారీ భద్రత; మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న నిరసనకారులు

శబరిమలలో భారీ భద్రత; మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న నిరసనకారులు

Last Updated : Oct 17, 2018, 01:04 PM IST
శబరిమలలో భారీ భద్రత; మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న నిరసనకారులు

శబరిమల అయ్యప్ప ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు సాయంత్రం శబరిమల ఆలయం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి సిద్దమవుతుండగా.. మరోవైపు మహిళలను అడ్డుకుంటామని నిరసనకారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు పంబకు వెళ్లే ప్రతి వాహనాన్ని పరిశీలిస్తూ మహిళలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని శివసేన హెచ్చరించిన సంగతి తెలిసిందే..!

 

 

ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. నీలక్కల్‌, పంబా బేస్‌ క్యాంప్‌ల వద్ద మహిళా పోలీసులతో సహా వేయి మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.

 

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరతామని కేరళ సీఎం పి.విజయన్ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై పున:సమీక్ష కోసం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయబోమన్నారు. ఆలయంలోకి వెళ్లే మహిళా భక్తులకు తగిన భద్రత కల్పిస్తామన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. కాలానుగుణంగా సంప్రదాయాలు మారాల్సిందేనని విజయన్‌ అన్నారు

అటు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆందోళనకారులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా మహిళలను అడ్డుకోవడం సరికాదన్నారు. త్రిపుల్‌ తలాఖ్‌ కూడా సంప్రదాయమేనని, అయితే దానిని నిషేధించినప్పుడు అందరూ హర్షించారని గుర్తు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళ ప్రవేశంపై వివాదం హిందూ పునరుజ్జీవనానికి, సంస్కరణ వికాస వ్యతిరేకతకు మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆయన అభివర్ణించారు.

 

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించడం ద్వారా శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని ధ్వంసం చేశారని శబరిమల కొండ పరిసర ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అంటున్నారు.

 

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. ఆ తీర్పుకు వ్యతిరేకంగా కేరళవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో శబరిమల ఆలయాన్ని తెరవడం ఇదే తొలిసారి.

 

Trending News