అయ్యప్ప గుడిలోకి మహిళలు వెళితే నరికేయాల్సిందే: తమిళ సినీ నటుడు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సాహసం మహిళలు చేస్తే వారిని నరికేయాల్సిందేనని బీజేపీ మద్దతుదారుడు, సినీ నటుడు కొల్లం తులసి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Oct 12, 2018, 08:47 PM IST
అయ్యప్ప గుడిలోకి మహిళలు వెళితే నరికేయాల్సిందే: తమిళ సినీ నటుడు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సాహసం మహిళలు చేస్తే వారిని నరికేయాల్సిందేనని బీజేపీ మద్దతుదారుడు, సినీ నటుడు కొల్లం తులసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా నరికిన దేహంలో ఒక భాగాన్ని ఢిల్లీకి, మరో భాగాన్ని కేరళ సీఎంకి పంపాలని తులసి తీవ్రపదజాలాన్ని ఉపయోగించి తెలిపారు. అయ్యప్ప పవిత్రతను దెబ్బతీసే ఏ పనిని కూడా తాను సమర్థించనని తులసి ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయంలోకి స్త్రీలను అనుమతించడం అంటే హిందూ ధర్మాన్ని అవమానించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పును మహిళలు కూడా సమర్థించడం లేదని.. ఇలాంటి తీర్పును ప్రజలపై రుద్దాల్సిన అవసరం లేదని కూడా తులసి అన్నారు.

ఈ తీర్పుకు నిరసనగా ఎన్డీఏ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న తులసి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ తీర్పును ఖండిస్తూ.. పలువురు కోర్టులో పిటీషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే తీర్పుపై అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ కూడా స్పందించారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించాలని అనుకుంటే నేలపై పడుకున్న భక్తులను తొక్కి మరీ లోపలికి వెళ్లండని అన్నారు. 

తాజాగా.. ఇదే తీర్పుపై రివ్యూ పిటీషన్లు వేయగా.. ఈ పిటీషన్లను అంత వేగంగా విచారించాల్సిన అవసరం ఏ మాత్రం లేదని కోర్టు తెలిపింది. తాజాగా నటుడు కొల్లం తులసి చేసిన వ్యాఖ్యలపై అనేక మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం 10 సంవత్సరాల నుండి 50 ఏళ్ల వయసు గల మహిళలపై శబరిమల ఆలయ సందర్శనకు సంబంధించి నిషేధం ఉంది. ఈ నిషేధం పై ఎవరో పిల్ వేయగా.. విచారించిన కోర్టు మహిళలు ఆలయాన్ని సందర్శించవచ్చని తెలిపింది.

Trending News