కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రాహుల్ ప్రసంగం చాలా బాధ్యతారహితంగా ఉందని ఆమె తెలిపారు. తమను పాండవులతో పోల్చుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. రాముడి ఉనికిని ప్రశ్నించిన రోజులను కూడా గుర్తుంచుకోవాలని ఆమె చెప్పారు.
హిందువులను, వారి నమ్మకాలను ఒకప్పుడు వేలెత్తి చూపించిన పార్టీ... ఇప్పుడు హిందు దేవతల గురించి మాట్లాడడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. టెక్నాలజీని ఇష్టపడని కాంగ్రెస్.. పత్రికా స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాహుల్ తొలుత.. తన నానమ్మ ఇందిరాగాంధీ మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించారో గుర్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే అమిత్ షా పై నిందలు వేసిన రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసులో మాత్రం ఇంకా బెయిల్ పైనే ఉన్నారని నిర్మలా సీతారామన్ ఆయనపై మండిపడ్డారు. అమిత్ షాకి షోహ్రబుద్దీన్ కేసులో క్లీన్ చీట్ ఎప్పుడో లభించిందని ఆమె పేర్కొన్నారు.