కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుంది

కర్నాటకలో 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  బి.ఎస్. యడ్యూరప్ప నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Last Updated : Apr 9, 2018, 05:44 PM IST
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుంది

బెంగళూరు: కర్నాటకలో 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  బి.ఎస్. యడ్యూరప్ప నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం కర్ణాటక రాష్ట్రానికి వచ్చారు. ర్యాలీలో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

'పరివర్తన్ ర్యాలీ' లో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ.. 'వచ్చే రెండు మూడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుంది. కర్ణాటకలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్ యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ పార్టీ ఎన్నికల్లో నిలబడుతుంది' అన్నారు. 

రాజ్‌నాథ్ సింగ్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెలరేగారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెబుతూ..  స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలతో పాటు పలు కుంభకోణాల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ 'విభజించు-పాలించు' తరహాలో పాలన చేస్తుందని, మతపరమైన అల్లర్లను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. 

ప్రభుత్వం కెంపెగౌడ, కిత్తూరు  చెన్నమ్మ, సర్ ఎం. విశ్వేశ్వరయ్య వేడుకలను ఎందుకు జరపడం లేదు? కేవలం టిప్పు‌సుల్తాన్ వేడుకలను ఎందుకు జరుపుతున్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పార్టీకి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందిస్తూ.. కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో అల్లర్లకు, సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని  రాజ్‌నాథ్ ఆరోపించారు. 

సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత చర్య తీసుకోకపోవడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. బీజేపీ అధికారంలో వస్తే.. చట్టాలు మరింత కఠినతరం చేస్తామని.. తప్పుచేసినవారు కేసు నుండి తప్పించుకోలేరని అన్నారు. దేశాభ్యుదయం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న వివిధ కీలక నిర్ణయాలలోని ప్రధానాంశాలను ప్రస్తావిస్తూ, రాజ్‌నాథ్ భారత్ ఇకపై బలహీన దేశం కాదని, ఒక సూపర్ పవర్ అని అన్నారు.

Trending News